అయ్యప్ప స్వామి వారి అద్భుతమైన లీలలు…


అయ్యప్ప స్వామి వారి అద్భుతమైన లీల
అయ్యప్ప అని పిలిస్తే చాలు వెంటనే పలికే స్వామి

కేరళ లోని పాలక్కాడు అనే గ్రామంలో కేశవన్ అనే వ్యక్తి జీవిస్తుండేవాడు. అతనికి చిన్నతనం నుండే శబరిమల అయ్యప్ప స్వామి అంటే ఎనలేని భక్తి. ప్రతీ సంవత్సరం అయ్యప్ప మాల వేసుకుని నియమ నిష్టలతో మండల దీక్ష పూర్తి చేసి పాలక్కాడు నుండి శబరిమలకు కాలినడకన వెళ్ళి దర్శనం చేసుకుని వస్తుండేవాడు. అతనికి తన 23వ ఏట వివాహం చేసారు పెద్దలు. కానీ పెళ్లై 35 సంవత్సరాలు దాటినా వారికి సంతానం కలుగలేదు.

ఇక సంతానం కలుగదని ఆశలు వదులుకున్నారు ఆ దంపతులు. ఒకరోజు కేశవన్ కు స్వప్నంలో అయ్యప్ప స్వామి దర్శనమిచ్చి, ” నీకు ఒక కొడుకుని ప్రసాదిస్తున్నాను ” అని చెప్పారు. కేశవన్ నిద్రలేచి ఈ విషయం అందరికీ చెప్పాడు , కానీ ఎవరూ నమ్మలేదు , ఈ వయస్సులో నీకు పిల్లలా , ఏదో బ్రమ పడుంటావు అని కొట్టిపారేశారు. ఈ స్వప్నం వచ్చిన నెలలోనే తన భార్య గర్భం ధరించింది. ఏడాదికి వారికి ఒక కొడుకు జన్మించాడు. స్వామి వారి మీద ప్రేమతో తన కుమారునికి ” అయ్యప్ప ” అనే పేరు పెట్టుకున్నాడు.

దురదృష్టవ శాత్తూ ఆ కుమారునికి కాళ్ళు సరిగ్గా రాలేదు . తనంతట తాను లేచి నిలువలేని స్థితి. కాళ్ళు లేని తన కొడుకుని చూసి కేశవన్ ఎంతో బాధ పడేవాడు. స్వామీ సంతానం మీద ఆశలు వదులుకున్నాక నీ వరప్రసాదం వలన ఈ కొడుకు జన్మించాడు. కొడుకు పుట్టాడని ఆనందించే సమయంలో తనకు ఈ అవిటితనం ఉందని తెలిసి దుఃఖం కలుగుతోంది. ఈ వయస్సులో కాళ్ళు లేని కొడుకుతో ఎలా జీవించేది అని బాధపడుతుండేవాడు. ప్రతీ సంవత్సరం శబరిమలకు వెళుతూ తనతో పాటూ కొడుకును కూడా తీసుకెళ్ళేవాడు. అంత దూరం తన కొడుకుని ఎత్తుకుని నడకదారిలో తీసుకెళ్ళడం చాలా కష్టంగా ఉండేది. అయినా స్వామి వారి మీద భక్తితో ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి , శక్తిని కూడదీసుకుని నియమంగా యాత్ర చేసేవాడు.

అయ్యప్పకు 8 ఏళ్ళ వయస్సు రాగానే తన తల్లిదండ్రులు కాలం చేసారు . కాళ్ళు లేని ఆ పసివాడు తమకు భారం అవుతాడనే భయంతో బంధువులు దూరం పెట్టారు. కేశవన్ స్నేహితుడు గణేషన్ మాత్రం అయ్యప్పను దగ్గరకు తీసి తన ఇంట్లో ఉండనిచ్చాడు. ఎంతమంది ఉన్నా తల్లిదండ్రులు లేని లోటు ఎవరూ తీర్చలేనిది. అయ్యప్పకు అవిటితనంతో పాటూ ఒంటరితనం కూడా అలవాటయింది. ఒక సంవత్సరం గడిచాక తన తండ్రిలానే అయ్యప్ప కూడా శబరిమల యాత్ర చేయాలనుకున్నాడు. తన ఆలోచనను గణేషన్ చెప్పగానే , నిన్ను అంతదూరం తీసుకువెళ్ళడం మా వల్ల కాదు. తోడుగా రాగాలము కానీ ఎత్తుకుని తీసుకువెళ్ళే శక్తి మాకులేదు అన్నారు.

అయ్యప్పకు శబరిమలకు వెళ్ళి స్వామి వారితో తన గోడు వెలిబుచ్చాలని ఉంది. ఒకరోజు రాత్రి ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి బయలుదేరాడు. దారి తెలియదు , చీకటి , బయలుదేరిన కాసేపటికే హోరున వర్షం కురుస్తోంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా అయ్యప్పకు మాత్రం వెనుకకు వెళ్ళాలనే ఆలోచనే లేదు. అలానే కాళ్ళు ఈడ్చుకుంటూ కాస్త దూరం వెళ్ళి , ఇక ముందుకు వెళ్ళే శక్తిలేక సొమ్మసిల్లి పడిపోయాడు.

తను కళ్ళు తెరుస్తూనే ఒక పూరి గుడిసెలో ఉన్నాడు. నేనెక్కడున్నాను అని అడిగాడు అయ్యప్ప.నిన్న రాత్రి వర్షంలో మా ఇంటి ముందు స్పృహ లేకుండా పడి ఉన్నావు. నా మనవడు నిన్ను చూసి లోపలకు తీసుకువచ్చాడు అని చెప్పింది ఒక ముసలవ్వ. ఆ మాటలు చెబుతుండగానే ఒక 18 ఏళ్ళ అబ్బాయి లోపలకి వచ్చాడు.ఇదిగో నా మనవడు ” స్వామి ” వచ్చాడు అని చెప్పింది ఆ ముసలవ్వ. ఇప్పుడు నీకెలా ఉంది అని అడిగాడు స్వామి. నేను కోలుకున్నాను, నన్ను చేరదీసి మీ ఇంట్లో నన్ను సేదతీర్చినందుకు కృతజ్ఞతలు,నేను వెళ్ళాలి అన్నాడు అయ్యప్ప.

ఎక్కడకు వెళ్తున్నావు అని అడిగాడు స్వామి. నేను శబరిమల వెళ్తున్నాను , నా బాధ ఆయనకు చెప్పుకోవాలనుకుంటున్నాను , ఆయన వలనే నేను పుట్టానని మా నాన్న అంటుడేవాడు , ఆయనే నన్ను పుట్టిస్తే ఈ అవిటితనం ఎందుకిచ్చినట్లు , నా తల్లిదండ్రులను ఎందుకు తీసుకెళ్ళినట్లు అని అడుగుతాను అన్నాడు. స్వామి , ఆ ముసలవ్వ ఇద్దరూ నవ్వుకున్నారు. సరే అలాగే అడుగుదువులే కానీ ఇలా ఒక్కడివే ఎలా వెళతావు , నీకు వెళ్ళే మార్గం అయినా తెలుసా అని అడిగాడు స్వామి.

తెలియదు కానీ ఆయనే నన్ను పుట్టించి ఉంటే ఆయనే నన్ను తన దగ్గరకు రప్పించుకుంటాడు అని సమాధానం చెప్పాడు. మేము కూడా శబరిమల వెళ్ళాలి అనుకుంటున్నాము , మాతోరా అందరమూ కలిసే వెళదాము అన్నాడు స్వామి. ముగ్గురూ బయలుదేరారు , స్వామి అయ్యప్పను ఎత్తుకున్నాడు , ముసలమ్మ పక్కనే నడవడం మొదలుపెట్టింది. రెండడుగులు కూడా వేసినట్లు లేదు అదిగో పంబ అన్నాడు స్వామి.అప్పుడే పంబ వచ్చిందా , ఇంత త్వరగా ఎలా వచ్చింది , ఎవరినైనా కొనుక్కుందాం అన్నాడు అయ్యప్ప. ఇదే పంబ రోజూ ఇక్కడకు వస్తుంటాను నాకు తెలియదా అన్నాడు స్వామి.ముగ్గురూ పంబలో స్నానం చేసారు.

అయ్యప్పకు పంబలో అడుగు పెడుతూనే వొళ్ళంతా విద్యుతు ప్రవహించినట్లు అనిపించింది. కొత్త శక్తి వచ్చినట్లు ఉంది. తన కాళ్ళ మీద లేచి నిలబడ్డాడు. నాకు కాళ్లోచ్చాయి .. కాళ్లోచ్చాయి .. అంటూ కేరింతలు కొడుతుంటే అక్కడున్న భక్తులంతా స్వామి శరణం అయ్యప్ప అని శరణు గోష చేయడం ఆరంభించారు. సరే సరే ఇవన్నీ ఆయన లీలలే పద కొండ ఎక్కాలి అన్నాడు స్వామి.

ముసలవ్వ , స్వామి , అయ్యప్ప కొండను ఎక్కడం ప్రారంభించారు. స్వామి అయ్యప్పకు అన్నీ వివరించి చెబుతున్నాడు. మాట్లాడుతుండగానే 18 మెట్లదగ్గరకు చేరుకున్నారు. అప్పుడు స్వామి ఆ 18 మెట్ల గురించి వివరించి చెప్పాడు. భక్తితో అయ్యప్ప మెట్లకు మొక్కుకుంటూ పైకి చేరాడు.

అయ్యప్ప చూస్తుండగానే స్వామి , ముసలవ్వ ఇద్దరూ గర్భ గుడిలోకి వెళ్ళి అంతర్ధానం అయ్యారు. అయ్యప్ప ఆశ్చర్యపోయాడు ,జరిగినది చుట్టుపక్కల భక్తులకు చెబుతూ ఉంటే వాళ్ళెవరు ఆ ముసలమ్మను , స్వామిని చూడలేదు అన్నారు. అప్పుడు అయ్యప్పకు అర్ధం అయ్యింది వచ్చింది ఇంకెవరో కాదు ఆ భక్త శబరీ , అయ్యప్ప స్వామేనని. ఇంతలోనే గణేషన్ అయ్యప్పను వెతుక్కుంటూ అక్కడకు చేరాడు. మీరెలా వచ్చారు అని అడిగాడు అయ్యప్ప. నాకు స్వప్నంలో స్వామి కనిపించి నీ గురించి చెప్పి , ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావనీ ,నిన్ను తీసుకువెళ్ళమని చెప్పాడు అన్నాడు.

అక్కడున్నవారంతా స్వామి వారి లీలలను విని ఆశ్చర్యపోయారు. శబరిమల మొత్తం అయ్యప్ప శరణు గోషతో మారుమ్రోగింది.

ఇది కేరళలో కొన్ని ప్రాంతాలలో ప్రాచుర్యంలో ఉన్న అయ్యప్ప స్వామి వారి లీల. ఇటువంటి లీలలు ఎన్నో ఆయన భక్తుల జీవితాలలో సంభవించాయి. అదృష్టం వలన వాటిలో కొన్నైనా ఏదో ఒక మార్గంలో మనకు తెలుస్తుంటాయి.

అందరికీ ఈ అద్భుతమైన అయ్యప్ప స్వామి లీలను షేర్ చేయండి

స్వామియే శరణం అయ్యప్ప

About The Author