కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎస్‌. జైపాల్‌రెడ్డి కన్నుమూత…


కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సూదిని జైపాల్‌రెడ్డి(77) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూలై 20న గచ్చిబౌలిలోని ఏషియన్‌ గ్యాస్ర్టో ఎంట్రాలజీ ఆసుపత్రిలో చేరారు. చికిత్సపొందుతూ ఈరోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.

తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌జిల్లా మాడుగులలో 1942 జనవరి 16న సూదిని దుర్గారెడ్డి, యశోదమ్మ దంపతులకు జన్మించిన జైపాల్ రెడ్డికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. జైపాల్‌ రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం మాడుగుల, నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగింది.

ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఇంగ్లీష్‌ లిట్‌రేచర్‌లో పట్టభద్రుడైన జైపాల్‌రెడ్డి విద్యార్థి దశనుంచే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు.

#రాజకీయ_ప్రస్థానం

కాంగ్రెస్‌ అత్యవసర పాలనను వ్యతిరేకిస్తూ ఆపార్టీకి రాజీనామా చేసి జనతాపార్టీలో చేరారు. 1985 నుంచి 88 వరకు జనతాపార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1980లో మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీపై పోటీ చేసి జైపాల్‌రెడ్డి వార్తల్లో ప్రముఖ వ్యక్తిగా నిలిచారు, అయితే ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.

1969లో తొలిసారి మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన #జైపాల్‌రెడ్డి .. నాలుగు సార్లు అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించారు.

1984లో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.1999, 2004లో మిర్యాలగూడ నుంచి ఎంపీగా గెలుపొందారు. 1990, 1996లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

జూన్‌ 1991 నుంచి 1992 వరకు రాజ్యసభాపక్ష నేతగా వ్యవహరించారు. 1999 నుంచి 2000 వరకు సభాహక్కుల ఉల్లంఘన కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు.

ఐకే గుజ్రాల్‌ కేబినెట్‌లో కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన జైపాల్ రెడ్డి, మన్మోహన్‌సింగ్‌ క్యాబినెట్ లో పెట్రోలియం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారం అందుకున్న జైపాల్ రెడ్డి దక్షిణాది నుంచి తొలిసారి ఉత్తమ పార్లమెంటేరియన్‌ పురస్కారం అందుకున్న నేతగా గుర్తింపు పొందారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అగ్రనేతలలో ఒకరుగా, తెలంగాణ విభజన సమయంలో పార్టీ అధినాయకత్వం వద్ద అన్నీ తానై వ్యవహరించారు జైపాల్ రెడ్డి. ప్రస్తుత మల్కాజ్‌గిరి ఎంపీ తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, #రేవంత్‌రెడ్డి, జయపాల్ రెడ్డికి సమీప బంధువు.

About The Author