యాదాద్రి పనుల్లో వేగం -95 శాతం శిల్పిపనులు పూర్తి

యాదాద్రి ఆలయ నిర్మాణం సరికొత్త చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలువనున్నది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. దేశంలోనే ఎవరూ చేపట్టని కార్యాన్ని భుజాన వేసుకుని త్రికరణశుద్ధితో చేపట్టిన యాదాద్రి నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ప్రధానాలయంలో శ్రీవారి నిజదర్శనాలు ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కసరత్తు ప్రారంభించడంతో వైటీడీఏ వైస్ చైర్మన్ జీ కిషన్‌రావు, ఇతర అధికారులు అప్రమత్తమయ్యారు. బుధవారం యాదాద్రిలో వైటీడీఏ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఇంజినీరింగ్, శిల్పి పనుల కాంట్రాక్టర్లు, స్థపతులు, ఉప స్థపతులతో సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఎప్పుడు యాగం నిర్వహించినా సిద్ధంగా ఉండాలని చెప్పారు.

శ్రీసుదర్శన నారసింహ మహాయాగం ఎప్పుడు నిర్వహిస్తే నిజదర్శనాలు కూడా అప్పుడే ప్రారంభమవుతాయని, అధికారులంతా పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. పనులు ఆలస్యమైతే కఠిన చర్యలు ఉంటాయని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. అనంతరం కిషన్‌రావు మాట్లాడుతూ.. యాదాద్రి ఆలయ నిర్మాణంలో 95 శాతం శిల్పి పనులు పూర్తయ్యాయని తెలిపారు. నిజ దర్శనాల తేదీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేస్తారని చెప్పారు. నిర్మాణాల పూర్తికి అవసరమైన కార్యాచరణను తాము పూర్తిచేసే పనిలో ఉన్నామని పేర్కొన్నారు. సమీక్షలో కూడా ఇదే విషయాన్ని తెలియజేశామని చెప్పారు. ఎక్కడా రాజీలేకుండా పనులు పూర్తిచేయించేందుకు శ్రమిస్తున్నామని ఆయన వివరించారు.

About The Author