కేంద్రం హోం మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ నేత మనీష్ తివారీ మధ్య రసవత్తర చర్చ…
జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన 370 అధికరణ రద్దుకు సంబంధించి రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం కేంద్రం హోం మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ నేత మనీష్ తివారీ మధ్య రసవత్తర చర్చ జరిగింది. కాంగ్రెస్ తరఫున మనీష్ తివారీ మాట్లాడుతూ, రాష్ట్ర అసెంబ్లీ అనుమతి లేకుండా 370వ అధికరణను రద్దు చేయరాదని అన్నారు. కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన పెట్టి 370 అధికరణ రద్దు చేయడం ఏమిటని నిలదీశారు.
ఈశాన్య రాష్ట్రాల్లోనూ రాష్ట్రపతి పాలన అమల్లోకి తెచ్చి, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ హక్కులను పార్లమెంటులో ఉపయోగించుకుని ఆర్టికల్ 371ని కూడా రద్దు చేయవచ్చని, తద్వారా ఈశాన్య రాష్ట్రాలకు ఎలాంటి సందేశం మీరు ఇవ్వదలచుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఇందువల్ల ఎలాంటి సంకేతాలు వెళ్తాయని అమిత్‌షాను ఆయన నిలదీశారు.
దీనికి అమిత్‌షా స్పందిస్తూ, ముందు కాంగ్రెస్ ఓ విషయంపై స్పష్టత ఇవ్వాలన్నారు. 370 అధికరణ రద్దుకు కాంగ్రెస్ అనుకూలమా? కాదా? అనేది తేల్చి చెప్పాలని అన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) భారత్‌లో అంతర్భాగమని అనుకుంటున్నారా లేదా? చెప్పాలన్నారు. పార్లమెంటుకు ఎలాంటి అధికారులు ఉన్నాయని అనుకుంటున్నారని ప్రశ్నించారు.
కశ్మీర్‌పై పార్లమెంటులో చట్టం చేయాలంటూ ఐక్యరాజ్యసమితి అనుమతి తీసుకోవాలన్నది కాంగ్రెస్ అభిప్రాయమా? అని సూటిగా ప్రశ్నించారు. పీఓకే, అక్సాయ్ చిన్ అనేవి కశ్మీర్‌లో అంతర్భాగమని భారత రాజ్యంగం స్పష్టంగా చెబుతోందని, కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, దానిపై ఎలాంటి చట్టాలైనా చేసే అధికారం పార్లమెంటుకు ఉందని, ఇందుకు ఎవరి అనుమతి అవసరం లేదని అమిత్‌షా కుండబద్ధలు కొట్టారు.