బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమం…
కిడ్నీ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటూ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈనెల 9న ఆస్పత్రిలో చేరిన జైట్లీకి సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఎయిమ్స్‌లో చేరినప్పటి నుంచి జైట్లీ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఉదయం జైట్లీని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ పరామర్శించారు. మరికాసేపట్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జైట్లీని కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వాకబు చేస్తారని భావిస్తున్నారు.కాగా నరేంద్ర మోదీ తొలి సర్కార్‌లో పలు కీలక శాఖలు నిర్వహించిన 66 సంవత్సరాల జైట్లీ అనారోగ్య కారణాలతో 2019 లోక్‌సభ ఎన‍్నికల్లో పోటీ చేయని సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో జైట్లీ వైద్య చికిత్స నిమిత్తం అమెరికాలో ఉండటంతో పీయూష్ గోయల్ ఆయన స్ధానంలో తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మోదీ ప్రభుత్వం రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టిన అనంతరం తన ఆరోగ్య పరిస్థితి సహకరించనందున తాను ప్రభుత్వంలో, క్యాబినెట్‌లో ఎలాంటి బాధ్యత నిర్వహించలేనని అరుణ్ జైట్లీ ప్రధానికి లేఖ రాశారు