నా ఇంటిని ముంచడానికి కుట్ర చేశారు: చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వ విధానాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తన ఇంటిని ముంచేందుకు ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు. అయితే తన ఇల్లు మునగలేదు కానీ.. పేదల ఇళ్లను ముంచారని ధ్వజమెత్తారు. ఇవి సహజంగా వచ్చిన వరదలు కావన్నారు. ప్రాజెక్టుల్లో కొంత నీటిని ముందే విడుదల చేసి ఉంటే వరద వచ్చేదే కాదని చెప్పుకొచ్చారు. తన ఇంటిని ముంచడానికే పైన నీళ్లను ఆపి ఒకేసారి వదిలారని అన్నారు. తాను ఇంట్లో లేనప్పుడు నోటీసులు ఇవ్వడానికి వచ్చారంటూ విమర్శలు గుప్పించారు. ‘‘నా ఇళ్లు మునిగిపోతే ఓనర్కు ఇబ్బంది అవుతుంది, మీకెందుకు బాధ?’’ అంటూ మంత్రుల తీరుపై మండిపడ్డారు. ఓవైపు ముంపునకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. వారిని పట్టించుకోకుండా తన ఇంటి చుట్టే తిరుగుతున్నారని నిప్పులుచెరిగారు. ఇదే సమయంలో అన్న క్యాంటీన్లను ఎత్తివేయడంపైనా ప్రభుత్వ తీరును చంద్రబాబు తప్పుపట్టారు. అన్న క్యాంటీన్లు ఉండిఉంటే వరద బాధితుల ఆకలి తీర్చేవని అన్నారు. అన్న క్యాంటీన్లను ఎందుకు తొలగించారో తెలియడం లేదన్నారు. సీఎం జగన్ మాటలు ఎన్నో చెప్పారు కానీ.. చేతలు గడప కూడా దాటడం లేదని ఎద్దేవా చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముంపు బాధితులకు ప్రభుత్వం ఎలాంటి సాయం చేయడం లేదని ఆరోపించారు. బాధితులకు కనీసం భోజన సదుపాయం కూడా కల్పించలేదని ప్రభుత్వ తీరుపై నిప్పులుచెరిగారు. విజయవాడ ముంపు ప్రాంతాల్లో రిటర్నింగ్ వాల్ నిర్మించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. స్థానికులందరికీ పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. మంగళవారం విజయవాడకు వచ్చిన చంద్రబాబు.. ముంపు ప్రాంతాలైన గీతానగర్, భూపేష్ గుప్తా నగర్, తారకరామా నగర్లో పర్యటించారు.