ఈ కాల్ సెంటర్ ఆదాయం నెలకు 50 లక్షలు…?
లవ్ ఆర్ట్స్ పేరుతో కోల్‌కతాలో కాల్ సెంటర్ సంప్రదించిన వారికి ఆన్లైన్ డేటింగ్ ఆఫర్స్ ఆపై పోలీసుల పేరుతో ఫోన్లు చేసి బెదిరింపు బాధితుల నుంచి అందినకాడికి డబ్బులు వసూలు గుట్టురట్టు చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు
ఎదుటివారిబలహీనతల్ని ఆసరాగా చేసుకుంటూ ఆన్లైన్లో డేటింగ్ సైట్ పేరుతో రిజిస్టర్ చేయడంతో పాటు ఫోన్‌కాల్స్ ద్వారానూ ఎర వేసి, బెదిరింపులకు పాల్పడి, అందినకాడికి దండుకుంటున్న ముఠా గుట్టును సిటీ సైబర్ క్రైమ్‌పోలీసులు రట్టు చేశారు. కోల్‌కతా కేంద్రంగా పని చేస్తున్న కాల్ సెంటర్‌పై దాడి చేసిన అధికారులు ముగ్గురిని అరెస్టు చేశారు. మరో 16 మంది నిందితులకు నోటీసులు జారీ చేసినట్లు సీసీఎస్ సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి సోమవారం తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన సోమ రోక అక్కడ ‘లవ్ ఆర్ట్స్’ పేరుతో ఓ కాల్‌సెంటర్ ఏర్పాటు చేశారు. ఇందులో అర్నబ్‌సూర్ డెవలపర్‌గా, మహ్మద్ ఇమ్రాన్ జూనియర్ డెవలపర్‌గా పని చేస్తున్నారు. ఈ ముగ్గురు మరో 16 మంది యువతులను టెలీ కాలర్స్‌గా నియమించుకున్నారు. వీరికి నెలవారీ జీతాలు చెల్లిస్తూ ఫోన్లు చేయించడం, వచ్చిన కాల్స్‌ను రిసీవ్ చేసుకుని మాట్లాడటం వంటి బాధ్యతలు అప్పగించారు. వీరు పాటించాల్సిన అంశాలకు సంబంధించి ఓ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) సైతం సోమ ఏర్పాటు చేసింది. వీళ్లు ఆన్లైన్ డేటింగ్ సర్వీస్ ఇస్తామంటూ ఇంటర్నెట్లో పొందుపరిచారు. దీంతో పాటు వివిధ మార్గాల్లో పలువురి సెల్‌ఫోన్ నెంబర్లు సంగ్రహించి కాల్స్ చేస్తున్నారు. ఈ ఫోన్లకు స్పందించిన వారితో పాటు ఆన్లైన్లో తమ నెంబర్లు చూసి కాల్ చేసిన వారితోనూ టెలీకాలర్స్ మాట్లాడతారు.
తాము ఆన్లైన్లో డేటింగ్ సేవలు అందిస్తామంటూ చెప్తారు. అవతలి వ్యక్తులు ఆసక్తి చూపితే వారి నుంచి ప్రాథమికంగా రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.1025 ఆన్లైన్లో కట్టించుకుంటున్నారు. ఆపై తాము ప్లాటినం, గోల్డ్, సిల్వర్ పేర్లతో స్కీములు నిర్విహిస్తున్నామని చెప్తారు. రూ.3500 కట్టి సిల్వర్ స్కీమ్‌లో చేరితే యువతులతో చాటింగ్ చేసే అవకాశం, రూ.5500 కట్టి గోల్డ్‌లో చేరితో చాటింగ్‌తో పాటు ఫోన్‌కాల్స్, రూ.10,500 కట్టి ప్లాటినం స్కీములో సభ్యుడిగా మారితే ఆయా యువతుల్ని కలిసే అవకాశం కూడా ఉంటుందని ఎర వేస్తున్నారు. ఈ మొత్తాలు కట్టడానికి సిద్ధమైన వారికి బ్యాంకు ఖాతాల వివరాలు ఇచ్చి డబ్బు డిపాజిట్ చేయించుకుంటున్నారు. ఆపై టార్గెట్ చేసిన వ్యక్తి నుంచి ఫోన్ నెంబర్, ఈ–మెయిల్ ఐడీ, ఫొటో, చిరునామా అందించాలని కోరి…అలా చేస్తే మీరు నివసించే ప్రాంతానికి సమీపంలో ఉండే యువతి ఫోన్ నెంబర్లు ఇస్తామంటూ చెప్తున్నారు.
స్కీముల్లో చేరి, డబ్బుకట్టి, కోరిన వివరాలు పంపిన వారికి కొన్ని ఫోన్ నెంబర్లు సైతం పంపిస్తున్నారు. వాస్తవానికి ఇవి తమ కాల్సెంటర్లో పని చేసే టెలీకాలర్ల వద్దే ఉంటాయి. ‘కస్టమర్లు’ ఫోన్/చాటింగ్ చేసినప్పుడు మాత్రం తమ వద్ద ఉన్న డేటా బేస్ ఆధారంగా వారు ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలుసుకుంటారు. దీని ఆధారంగా తాము ఆ సమీపంలో ఉంటామని చెప్పి నమ్మించి మాట్లాడటం, చాటింగ్ చేయడం చేస్తూ పూర్తిగా బుట్టలో పడేస్తున్నారు. ఆపై మళ్లీ సంప్రదించే టెలీకాలర్లు ఈసారి తాము ఇన్కమ్, ఎంజాయ్ పేర్లతో రెండు గ్రూపులు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. నిర్ణీత మొత్తం చెల్లించి వీటిలో చేరవచ్చని… ఇన్కమ్లో చేరితో అవతలి వ్యక్తుల్ని కలిసి అవకాశం ఉన్నప్పుడు వారి నుంచి డబ్బు సైతం తీసుకోవచ్చని, అలా వచ్చిన మొత్తంలో 20 శాతం తాము తీసుకుని 80 శాతం ఇస్తామని చెప్తున్నారు. ఎంజాయ్ గ్రూప్‌లో కేవలం ఎంజాయ్మెంట్ మాత్రమే ఉంటుందని నమ్మబలుకుతున్నారు. ఇదంతా అయ్యాక ఆ కాల్‌సెంటర్ నిర్వాహకులు అసలు కథ మొదలు పెడుతున్నారు. వీరే కస్టమర్ల వివరాలను వివిధ రకాలైన డేటింగ్ వెబ్‌సైట్స్‌లోకి అప్లోడ్ చేస్తున్నారు. ఇలా చేసిన తర్వాత కాల్‌సెంటర్ నుంచే తాము పోలీసులమని కస్టమర్లకు ఫోన్ చేస్తున్నారు. ఫలానా సైట్లో మీ పేరు రిజిస్టరై ఉందని, అది నేరం కావడంతో కేసు నమోదు చేశామని చెప్తున్నారు. అరెస్టు కాకుండా ఉండాలంటే డబ్బు చెల్లించాలంటూ రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు.
తమ బలహీనత బయటపడి పరువు పోతుందనే ఉద్దేశంతో అనేక మంది బాధితులు తాము మోసపోయామన్న విషయాన్నీ బయటకు చెప్పుకోవట్లేదు. ఈ పంథాలో సోమ అండ్ గ్యాంగ్ నగరానికి చెందిన ఒకరి నుంచి రూ.1.2 లక్షలు, మరొకరి నుంచి రూ.12 వేలు కాజేశారు. వీరి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ ఠాణాలో కేసులు నమోదయ్యాయి. దారుణంగా మోసాలు చేస్తున్న ఈ నేరగాళ్లను పట్టుకోవడానికి నిర్ణయించుకున్న అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఇన్స్పెక్టర్లు ఎన్.మోహన్‌రావు, గంగాధర్‌లతో కూడిన బృందం కోల్‌కతా వెళ్లి కాల్‌సెంటర్‌పై దాడి చేసింది. సోమ, అర్నబ్‌సూర్, ఇమ్రాన్‌లను అరెస్టు చేసింది. టెలీకాలర్స్‌గా పని చేస్తున్న మరో 16 మందికి నోటీసులు జారీ చేసింది.
ఈ కాల్‌సెంటర్ టర్నోవర్ నెలకు రూ.50 లక్షల వరకు ఉందని, ఇలాంటి సెంటర్లు అక్కడ అనేకం ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. బాధితుల నుంచి డబ్బు డిపాజిట్ చేయించడానికి వీరు వినియోగిస్తున్న బ్యాంకు ఖాతాలు వేరే వారి పేర్లతో, బోగస్ వివరాలతో ఉంటున్నాయని చెప్తున్నారు. అరెస్టు చేసిన ముగ్గురు నిందితుల్నీ కోల్కతాలోకి కోర్టులో హాజరుపరిచిన సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.