108 కష్టాలు..! సిబ్బందికి నేటికీ అందని వేతనాలు…


అత్యవసర వాహన(108) సేవల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఆగస్టు 1న చెల్లించాల్సిన వేతనాలు ఇప్పటికీ అందలేదు. మరో నాలుగు రోజులు గడిస్తే రెండో నెల వేతనాలనూ పొందాల్సిన పరిస్థితుల్లో.. వాహన చోదకులు, సాంకేతిక నిపుణులు, అత్యవసర ఫోన్‌ కాల్స్‌ను స్వీకరించే ఉద్యోగులందరూ జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. వైద్యఆరోగ్యశాఖ నుంచి ఇప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో వచ్చే నెలలోనైనా సకాలంలో వేతనాలు అందుతాయా? అనే ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది. నిధుల విడుదలలో జాప్యం ఇలాగే కొనసాగితే.. 108 అంబులెన్సు సేవలు కూడా నిలిచిపోయే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదమూ పొంచి ఉంది. ఇప్పటికే వరంగల్‌ పట్టణ జిల్లాలో కొన్నిచోట్ల బకాయిల చెల్లింపుల్లో జాప్యం కారణంగా ఆదివారం డీజిల్‌ పోయడానికి పెట్రోల్‌ బంకుల యజమానులు నిరాకరించినట్లుగా తెలిసింది. ఈ విషయం ఈఎంఆర్‌ఐ ఉన్నతాధికారులకు తెలియడంతో అప్పటికప్పుడు కొంత మొత్తాన్ని సర్దుబాటు చేసి 108 అంబులెన్సు సేవలు కొనసాగేలా చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

వ్యయంతో పోల్చితే సేవలు అమోఘం: రాష్ట్రంలో 320 అత్యవసర వాహనాలు అందుబాటులో ఉండగా.. నిరంతరం సేవలందించేందుకు 300 వాహనాలు సిద్ధంగా ఉంటాయి. వీటి డీజిల్‌ ఖర్చులు, నిర్వహణ వ్యయం కలుపుకొని నెలకు సుమారు రూ.కోటి వరకు ఉంటుంది. ఇక 108 అంబులెన్సు సేవల్లో పనిచేస్తున్న సిబ్బంది సుమారు 1500 మంది ఉంటారు. వీరికయ్యే వేతనాల ఖర్చు నెలకు సుమారు రూ.3.5 కోట్లు. అంటే 108 వాహన సేవల కోసం మొత్తంగా నెలకు రూ.4.5 నుంచి 5కోట్ల లోపే ఖర్చవుతుంది. ఏడాదికి గరిష్ఠంగా రూ.60 కోట్లు వ్యయమవుతుంది. ఈ అంబులెన్సుల ద్వారా నెలకు దాదాపు 40 వేలకు పైగా, ఏడాదికి సుమారు 5 లక్షల మందికి పైగా రోగులకు సేవలందిస్తున్నారు. 108 వాహనాల కోసం ప్రభుత్వం ఖర్చు చేసే నిధులతో పోల్చితే రోగులకు అందించే సేవలు ఎక్కువే. అత్యవసర వాహన సేవల ప్రాధాన్యం దృష్ట్యా క్రమబద్ధంగా నిధులు విడుదలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని ప్రజలు కోరుతున్నారు.

About The Author