తెలంగాణాలో మంత్రివర్గ విస్తరణపై సీఎం దృష్టి…


మంత్రివర్గ విస్తరణపై సీఎం దృష్టి ఒకటి లేదా రెండు విడతలుగా చేపట్టే అవకాశం మొదటి దఫా దసరా లోపు..సంక్రాంతి వరకు రెండో సారి విస్తరణ

శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రమంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించారు. ఒకటి లేదా రెండు దఫాల్లో దసరా నాటికి దీనిని చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొదటి దఫా దసరా లోపు కాగా.. రెండో విడత సంక్రాంతి నాటికి చేపట్టవచ్చని తెలిసింది. వచ్చే నెలలో శాసనసభ బడ్జెట్‌ సమావేశాలున్నాయి. వినాయక చవితి ఉత్సవాలు, ఆ తర్వాత బతుకమ్మ పండుగ ఉన్నాయి. ఇవన్నీ ముగిసిన తర్వాత కొత్త మంత్రులు వస్తారనే భావన తెరాస వర్గాల్లో ఉంది. ముహూర్తాలు బాగుంటే, ఇతర పరిణామాలేమైనా ఉంటే దసరా కంటే ముందే మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. మంత్రివర్గంలో ప్రస్తుతం సీఎంతో కలిసి 12 మంది ఉన్నారు. మరో ఆరుగురికి అవకాశం ఉంది. వివిధ సమీకరణాలపరంగా వారిని తీసుకోవాలని సీఎం భావిస్తున్నారు. తొలివిడతలో ముగ్గురిని, రెండో విడతలో మరో ముగ్గురిని తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది.

* మంత్రివర్గంలోకి తీసుకుంటామని గతంలో గుత్తా సుఖేందర్‌రెడ్డికి హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా ఆయనకు ఎమ్మెల్సీ స్థానం కట్టబెట్టారు. మంత్రిగా కూడా ఆయనకు అనుకూల వాతావరణం ఉంది.
* తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు కూడా స్థానం ఖాయంగా కనిపిస్తోంది.
* మిగిలిన నాలుగు స్థానాల్లో ఒక బీసీని తీసుకునే వీలుంది. బీసీ కోటాలో ముఖ్య సామాజిక వర్గానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు పోటీలో ఉన్నారు. దానం నాగేందర్‌, బాజిరెడ్డి గోవర్దన్‌, వినయ్‌భాస్కర్‌, జోగు రామన్న, గంగుల కమలాకర్‌, నన్నపనేని నరేందర్‌లు పోటీలో ఉన్నారు.
* మహిళా కోటాలో ఇద్దరికి అవకాశమిస్తామని సీఎం చెప్పారు. ఈ ప్రకారం ఎమ్మెల్సీ సత్యవతి రాఠోడ్‌ లేదా ఎమ్మెల్యే హరిప్రియనాయక్‌, సబితారెడ్డిల పేర్లు పరిశీలించే వీలుంది. ప్రస్తుతం మంత్రివర్గంలో మహిళ, గిరిజన కోటా అభ్యర్థుల్లేరు. సత్యవతి లేదా హరిప్రియను తీసుకుంటే ఈ కోటా భర్తీ అయ్యే వీలుంది.
* మాజీ మంత్రి హరీశ్‌రావుకు స్థానంపై ఉత్కంఠ నెలకొంది. సానుకూలతలను పరిగణనలోకి తీసుకుంటే ఆయనను తీసుకునే ఆస్కారం ఉంది.
* రాష్ట్రంలో మరో బలమైన సామాజికవర్గం నుంచి ఖమ్మం, హైదరాబాద్‌లలో ముగ్గురు ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్‌, మాగంటి గోపీనాధ్‌, అరికెపూడి గాంధీలు ఉన్నారు. వీరికి కూడా చోటు ఇవ్వాలనుకుంటే ఒకరిని తీసుకునే అవకాశం ఉంది.
* గిరిజన కోటాలోనే ఎమ్మెల్యే రేగ కాంతారావు పేరు కూడా ప్రచారంలో ఉంది.

About The Author