సేఫ్ సిటీగా హైదరాబాద్…దిగ్గజ కంపెనీలు వస్తున్నాయి…


★ సేఫ్ సిటీగా హైదరాబాద్

★ దిగ్గజ కంపెనీలు వస్తున్నాయి

★ హైదరాబాద్ ప్రజల రుణం తీర్చుకుంటాం

★ త్వరలోనే డబుల్ బెడ్‌రూం ఇండ్ల అందజేత

★ రైతుల పొలాలు పచ్చబడ్డయ్..కాంగ్రెసోళ్ల కండ్లు ఎర్రబడ్డయ్

★ కోటి ఎకరాల మాగాణి సీఎం లక్ష్యం

★ జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఒకప్పుడు కర్ఫ్యూలతో ఉండిన హైదరాబాద్ నగరాన్ని సురక్షితమైన నగరంగా తీర్చిదిద్దుతున్నామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు. ప్రభుత్వం నగరంలో 6లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటుచేసిందని, మరో 4లక్షల కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నదని వెల్లడించారు. మంగళవారం యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన టీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. రికార్డుస్థాయిలో ఒక సేఫ్ సిటీగా హైదరాబాద్‌ను నిలబెడుతున్నామన్నారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్‌లాంటి సంస్థలు ప్రపంచంలోనే వాటి రెండో అతిపెద్ద కేంద్రాలను హైదరాబాద్‌లో పెడుతున్నాయంటే అది కేసీఆర్ గొప్పతనమేనన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా పూర్తవుతున్నాయన్న కేటీఆర్.. త్వరలోనే వాటిని అప్పగించనున్నట్టు తెలిపారు. హైదరాబాద్ మహానగర ప్రజలిచ్చిన తీర్పునకు, ఆశీర్వాదానికి తప్పకుండా అందరినీ సంతృప్తిపరిచేస్థాయిలో రుణం తీర్చుకుంటామన్నారు. చరిత్రలో చూడని పురోగతిని, అభివృద్ధిని హైదరాబాద్‌లో చేసిచూపిస్తామని చెప్పారు. రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో ఎన్నో అనుమానాలు ఉండేవని, ఏడాదిలోనే వాటిని సీఎం కేసీఆర్ పటాపంచలు చేశారని అన్నారు.

95 శాతం తాగునీటి సమస్య పరిష్కారం
—————————————————————

రాష్ట్రం ఏర్పడకముందు హైదరాబాద్‌లో ఏ అపార్ట్‌మెంట్‌కు వెళ్లినా జనరేటర్.. ఏ షాపుకు వెళ్లినా ఇన్వర్టర్ కనిపించేవని, జిరాక్స్‌షాపు, జ్యూస్‌స్టాల్, చిన్న కిరాణషాపు పెట్టుకోవాలన్నా కష్టంగా ఉండేదని గుర్తుచేశారు. కానీ, కేసీఆర్ సీఎం అయిన ఆరునెలల స్వల్పకాలంలో చరిత్రలో ఎవరూ ఊహించనివిధంగా, అన్నివర్గాలకు 24 గంటల కరంట్ ఇచ్చారని చెప్పారు. మహానగరంలో మంచినీళ్ల కోసం ఎంత గోస, అవస్థలు ఉండేవో నాకు తెలుసు. నేను హైదరాబాద్‌లో పెరిగిన బిడ్డనే. అబిడ్స్‌లోని ఓ స్కూల్‌లో చదువుకునేవాణ్ణి. ఎండకాలం వచ్చిందంటే చాలు మహిళలు ఖాళీ బిందెలు పట్టుకొని ఖైరతాబాద్ జలమండలి ముందు ప్రదర్శనలు చేసేవారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే టీడీపీ ప్రదర్శన.. టీడీపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ల్ ప్రదర్శన ఉండేది. అప్పట్లో ప్రజలు ఎంతో ఇబ్బందిపడేవాళ్లు. ఈరోజు గోదావరి జలాలను శరవేగంగా హైదరాబాద్‌కు తెచ్చి 95% మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన ఘనత మన నేత కేసీఆర్‌కే దక్కింది అని కేటీఆర్ చెప్పారు. ఒకప్పు డు నిజాంపేట, కుత్బుల్లాపూర్‌లోని కొన్ని ప్రాంతాలకు 15రోజులకు ఒకసారి నీళ్లువచ్చేవని, ఇవ్వాళ రెండ్రోజులకొకసారి వస్తున్నాయంటే సీఎం పనితనమేనన్నారు.

అభివృద్ధిని జీర్ణించుకోలేని కాంగ్రెస్
—————————————————————

రైతుల పొలాలు పచ్చబడుతుంటే కాంగ్రెస్ నేతల కండ్లు ఎర్రబడుతున్నాయని, తెలంగాణలో అభివృద్ధిని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారని కేటీఆర్ ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. ప్రాజెక్టులు నిండుతున్నాయి. కరువు లేదు. తాగునీటికి, సాగునీటికి గోసలేదు. రైతులు సుభిక్షంగా ఉన్నారు. కేసీఆర్ తెచ్చిన రైతుబంధు, రైతుబీమా పథకాలు, మరోవైపు శరవేగంగా ప్రాజెక్టులు కడుతున్న విధానాలు.. వీటన్నింటినీ చూసి కాంగ్రెస్‌వాళ్ల గుండెలు అవిసిపోతున్నాయి అని అన్నారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావటమే కేసీఆర్ కల అని చెప్పారు. గోదావరి, కృష్ణానదుల్లో నీటిని ఒడిసిపట్టి, ప్రతి నీటిబొట్టును సద్వినియోగంచేసి పొలాలకు, పారిశ్రామిక అవసరాలతోపాటు నగర తాగునీటి అవసరాలకు మళ్లిస్తున్నామన్నారు. దేశం అబ్బురపడేలా తెలంగాణను సీఎం కేసీఆర్ అభివృద్ధి బాటలో నిలబెట్టారని చెప్పారు. పాలనలో ఆదర్శ సంస్కరణలు తీసుకొస్తూ, అవినీతి చీడల్లేని విధానాలతో దూసుకుపోతున్న తెలంగాణను చూసి దేశం అబ్బురపడుతున్నదన్నారు.

నాటు పడవలెక్కి నాటు మాటలు
—————————————————————

కాంగ్రెస్ నాయకులకు ఏం చేయాలో తెలియక ఆదిలాబాద్ జిల్లాకు పోయి, ప్రాణహితలో బోటు షికారుచేసి విమర్శలు గుప్పించారని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల బోటుషికారుపై తనకు వచ్చిన ఒక వాట్సప్ మెసేజ్ గురించి వివరిస్తూ.. ఒక నాటు పడవ. ఆ పడవలో పాపం పదిమంది కాంగ్రెస్ నాయకులు! జోరువానలో హోరుగాలిలో పడవ ప్రయా ణం.. తీరమెక్కడో.. గమ్యమేమిటో తెలియదు పాపం అంటూ పాడి సభికులను ఉత్సాహపరిచారు. కాంగ్రెస్‌కు జాతీయ అధ్యక్షుడు ఎవరో కూడా తెలియని పరిస్థితి ఉన్నదన్నారు. ఏదో ఒక విమర్శ చేయాలి కాబట్టి, తమ ఉనికిని కాపాడుకోవటానికి నాటుపడవలు ఎక్కి నాటు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలు ఛీత్కరించుకున్నా వారికి బుద్ధిరావడంలేదన్నారు.ఐదేండ్ల నుంచి అదే విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ఇంకా జ్ఞానోదయం కలుగలేదన్నారు. కేసీఆర్‌ను తిడితే చూపించే టీవీలు, రాసే పత్రికలు కొన్ని ఉన్నాయి కాబట్టే సీఎం అనే గౌరవం కూడా లేకుండా నోటికి ఎంతవస్తే అంత మాట్లా డేవాళ్లు తయారయ్యారని మండిపడ్డారు. ఏనుగు పోతుంటే చాలా జంతువులు అరుస్తుంటాయని, సుశిక్షితులైన టీఆర్‌ఎస్ సైనికులు ఇతర పార్టీల వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.

జాతీయ, అంతర్జాతీయ మన్ననలు పొందిన కేసీఆర్ పాలన
———————————————————————————–

సీఎం కేసీఆర్ నాలుగేండ్ల పాలన జాతీయ, అంతర్జాతీయ మన్ననలు పొందిందని కేటీఆర్ చెప్పారు. ఎన్నో అవార్డులను రాష్ట్రం దక్కించుకున్నదని తెలిపారు. మళ్లీ సీఎంగా కేసీఆర్ ఉం డాలని, ఆయనతోనే రాష్ట్రం ముందుకుపోతుందనే ఉద్దేశంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో 75% సీట్లు, 50% ఓట్లు ప్రజలు ఇచ్చారని చెప్తూ.. చరిత్రలో ఎన్నడూలేని విజయాన్ని కేసీఆర్‌కు కట్టబెట్టిన ఘనత టీఆర్‌ఎస్ కార్యకర్తలది, ప్రజలదేనన్నారు. ఒక సీనియర్ ఎమ్మెల్యే తనను కలిసి.. ఇతర సీఎంలు 20 ఏండ్లలో చేసిన పనిని కేసీఆర్ నాలుగేండ్లలోనే చేసి చూపించారని చెప్పారని తెలిపారు.

ఎమ్మెల్యే గోపీనాథ్‌పై ప్రశంసల జల్లు
—————————————————————

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఇం టింటికి తీసుకెళ్లి ఇస్తుంటారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్‌ను కేటీఆర్ ప్రశంసించారు. రంజాన్ సమయంలో పేద ముస్లింలకు కొత్త దుస్తులు ఇచ్చే కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తే.. ఉపవాసం ఉండే ముస్లింల ఇండ్లకు వెళ్లి బిర్యానీలు అందించిన ఘనత గోపీనాథ్‌దన్నారు. బతుకమ్మ పండుగకు అలా నే చేస్తానని చెప్పారని తెలిపారు. పేదలు బాగుండాలనే తపన ఉన్న ఎమ్మెల్యేలకు ప్రజల ఆశీర్వాదం ఉన్నంతకాలం టీఆర్‌ఎస్‌ను ఎవరూ ఏమీచేయలేరని కేటీఆర్ స్పష్టంచేశారు. తాను ప్రభుత్వంలో లేకపోయినా.. ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటానని హా మీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదులో మొత్తం నగరంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ముందంజలో ఉండటం పట్ల అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, పువ్వాడ అజయ్, కోరుకంటి చం దర్, ఎమ్మెల్సీలు ఎమ్మెస్ ప్రభాకర్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ రమేశ్, మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, సెట్విన్ చైర్మన్ బాక్రీ, డిప్యూటీ మే యర్ బాబా ఫసియుద్దీన్ పాల్గొన్నారు.

గంగా, జమునా తెహజీబ్‌తో నగరం
—————————————————————

ఉమ్మడి ఏపీలో గణేశ్ పండుగ వచ్చిందంటే హైదరాబాద్‌లో రెండుమూడు రోజులు కర్ఫ్యూ ఉండేదని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ, తెలంగాణలో ఒక్కసెకన్ కూడా కర్ఫ్యూ అవసరంలేకుండా శాంతిభద్రతలను అద్భుతంగా నడుపుతున్న ఘనత సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీకే దక్కుతుందని చెప్పారు. హిందూ, ముస్లిం ఘర్షణలు లేవు. ఆంధ్ర, తెలంగాణ పంచాయితీ లేదు. ఎక్కడవాైళ్లెనా సరే పొట్టకూటికోసం వచ్చిన బిడ్డలందరూ మనవాళ్లేనని గంగా జమునా తెహజీబ్‌తో అందరినీ కలుపుకొని, అద్భుతంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం మనది అన్నారు. మెట్రోలాంటి ప్రజారవాణా వ్యవస్థను నిర్మించుకున్నామని, పరిశ్రమలను ఆకర్షించుకుని మన పిల్లలకు కొలువులిచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పారు.

ఏడాదికి పింఛన్లపై రూ.12 వేల కోట్లు
—————————————————————

చరిత్రలో ఇన్ని సంక్షేమ పథకాలు పేదవారికి గతంలో ఎప్పుడైనా అందాయా? అనేది ప్రజలు ఆలోచించాలని కేటీఆర్ కోరారు. ఒకనాడు పింఛన్ రూ.70 ఉండేది. గల్లీలో ఐదుగురికిస్తే.. పదిమందికి వచ్చేదికాదు. అదేందని అడిగితే.. ఆ ఐదుగురిలో ఎవరైనా చనిపోతే అప్పుడు మీకు వస్తుందని చెప్పేవారు. తర్వాత 200 పింఛన్ వచ్చినా.. చారానా కోడికి బారానా మసాల అన్నట్టు వాటిని తీసుకునేందుకు వంద ఖర్చయ్యేది అని గుర్తుచేశారు. ఈ రోజు ఏ రాష్ట్రంలో లేనివిధంగా కేసీఆర్ సారథ్యంలో 50 లక్షలమందికి రూ.2 వేలు, దివ్యాంగులకు మూడువేల పింఛన్ ఇస్తున్నామని చెప్పారు. పింఛన్ల మీదే ఏటా రూ.12 వేల కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. ఇందులో కేంద్రం రూ.200 కోట్లు మాత్రమే ఇస్తుండటం సిగ్గుచేటని విమర్శించారు. పేదలపై ఢిల్లీకి ఎంత ప్రేమ ఉందో ఇందులోనే తెలుస్తున్నదన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌పాలిత రాష్ర్టాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి కార్యక్రమం ఉన్నదా? రెండువేలు, మూడువేల పింఛన్లు ఉన్నాయా? అని ప్రశ్నించారు. బీసీలు, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకోసం 700 గురుకులాలు ఏర్పాటుచేసి.. ఒక్కో విద్యార్థి మీద రూ.1.20 లక్షలు ఖర్చుపెడుతున్న ప్రభుత్వం ఎక్కడైనా ఉంటే చూపించాలన్నారు. ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాడుకుంటే.. నేడు ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు విశ్వాసం పెంచామని చెప్పారు.

పథకాల అమలులో దేశంలోనే నంబర్ వన్ తెలంగాణ
—————————————————————————–

కేటీఆర్ ఆదేశాలతో సభ్యత్వ నమోదును విజయవంతంగా పూర్తిచేశారు. దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నది. నీళ్లు, కరంట్ కష్టాలు లేకుండా సీఎం తీసుకుంటున్న చర్యలు అమోఘం. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో నక్సలిజాన్ని అరికట్టడంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణను అడిగి తెలుసుకున్నారు.

– హోంమంత్రి మహమూద్ అలీ

రాబోయే ఎన్నికల్లో పోటీ మనలో మనకే
—————————————————————

టీవీల్లో, పేపర్లలో వస్తున్నాయి కదా అని కాంగ్రెస్, బీజేపీవాళ్లు గాలిమాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని ఓరుస్తలేరు. రాబోయే ఎన్నికల్లో పోటీ మనలో మనకే ఉంటుంది. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక కార్యకర్తల్లో మరింత జోష్ పెరిగింది. కేసీఆర్ అమలుచేస్తున్న అభివృద్ధి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.

– మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్

About The Author