సెప్టెంబర్ 10 న జరుగనున్న మొహర్రం ను పురస్కరించుకొని ప్రభుత్వ శాఖలన్ని పకడ్బంది ఏర్పాట్లు…


సెప్టెంబర్ 10 న జరుగనున్న మొహర్రం ను పురస్కరించుకొని ప్రభుత్వ శాఖలన్ని పకడ్బంది ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు.
గురువారం సచివాలయంలో ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, షియా సంస్థల ప్రతినిధులతో మొహర్రం ఏర్పాట్ల పై హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సి.హెచ్. మల్లారెడ్డి ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్ తో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మొహర్రం సందర్భంగా జి.హెచ్.యం.సి ద్వారా సానిటేషన్ ఏర్పాటు చేయాలన్నారు. అదనపు లైటింగ్ తో పాటు, ప్రత్యేకంగా మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని పండుగల లాగనే మొహర్రంకు కూడా ప్రాధాన్యత ఇచ్చి ఏర్పాట్లు చేస్తున్నదని, ఆషూర్ ఖానాల రిపేర్స్ కోసం అవసరమైన నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. పటిష్టమైన పోలీసు బందోబస్తు ను పోలీస్ శాఖ ఏర్పాటు చేయాలని అన్నారు. మెట్రో వాటర్ వర్క్స్ ద్వారా నీటి సరఫరా చేయాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. మొహర్రం ఊరేగింపు సందర్భంగా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్లకు అవసరమైన మరమ్మత్తులు చేపట్టాలని కూడా ఆయన ఆధికారులను ఆదేశించారు. బీబీ కా ఆలం – ఊరేగింపు కొరకు ఏనుగు ను ఏర్పాటు చేయుటకు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా హెల్త్ క్యాంపులను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా హిందూ ముస్లీంలు కలిసి మొహర్రం ను జరుపుకుంటారని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లను గత సంవత్సరం లాగనే ఈ సారి కూడ చేయనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మొహర్రం సందర్భంగా ఏర్పాట్లలో ఎలాంటి అవాంతరాలు కలగకుండా అధికారులు చర్యలు తీసుకునేవిధంగా చూడాలని, ఇందుకు అవసరమైన అధికారులతో వాట్సాప్ గ్రూపు ను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని ప్రభుత్వ సలహాదారు ఏ.కె.ఖాన్ కు సూచించారు.
రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సమయం తక్కువగా ఉన్నందున అధికారులందరు సమన్వయంతో పనిచేసి గడువు లోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మహ్మద్ సలీమ్ ,మైనారిటీస్ ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మన్ అక్బర్ హుస్సేన్, MLC లు ఫరూఖ్ హుస్సేన్, అఫాన్ ది, MLA లు అహ్మద్ పాషా ఖాద్రి, ముంతాజ్ అహ్మద్ ఖాన్, రంగారెడ్డి జిల్లా ఇంచార్జీ కలెక్టర్ హరీష్, అదనపు కమీషనర్ ఆఫ్ పోలీస్ డి.ఎస్.చౌహాన్, మైనార్టీ సంక్షేమ శాఖ సంచాలకులు షానవాజ్ ఖాసీమ్ , ప్రజా ప్రతినిధులు, షియా సంస్థల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

About The Author