రివాల్వర్ రాణి.. కేరాఫ్ బీహార్…
బీహార్ లోని పాట్నా జిల్లాలో 14గ్రామాలకు పెద్ద ఆమె. పేరు అభా దేవి. ఎప్పుడూ చీరకట్టులో రివాల్వర్ పెట్టుకుని ఉంటుంది. రివాల్వర్ రాణి, లేడీ లయన్ గా బీహార్ లో పాపులర్. ఆ గ్రామంలోనే కాదు, జిల్లాలోనే రివాల్వర్ రాణి అంటే అందరికీ హడల్. రౌడీ మూకలు ఎక్కువగా తిరిగే బీహార్ లో అభా దేవి స్థానికులకు అండగా నిలబడ్డారు. ఎక్కడ ఎలాంటి ఆగడాలు జరిగినా బాధితులు పోలీసులకు కాకుండా నేరుగా అభా దేవికే ఫోన్ చేస్తారు. ఆమె వస్తుందని తెలిస్తే చాలు అల్లరి మూకలు ఎక్కడికక్కడ పారిపోతాయి. గ్రామ పెద్దకంటే ముందు అభా దేవి ఓ సాధారణ గృహిణి. భర్తపేరు రామ్ అయోధ్య. ఓసారి దొమ్మీలో అభాదేవిని చుట్టుముట్టాయి రౌడీ మూకలు. అప్పట్లో వారి బారినుంచి ఎలాగోలా ప్రాణాలతో బైటపడింది. అప్పటినుంచి ఆమె తనకు తోడుగా తుపాకీని ఉంచుకుంటోంది. 2016లో తుపాకీ లైసెన్స్ తీసుకున్న అభాదేవి ఎప్పుడూ తన వెంట రివాల్వర్ ఉంచుకుంటుంది. ఇంట్లోనుంచి బైటకు వచ్చిందంటే చాలు తుపాకీ ఉండాల్సిందే. తన పరిధిలోని గ్రామాల్లో ఎప్పుడైనా గొడవలు జరిగితే.. వెంటనే తుపాకీ తీసుకుని అక్కడికి వెళ్లేది. గాల్లోకి బుల్లెట్లు పేల్చి చాలా సందర్భాల్లో గొడవలు జరగకుండా ఆపింది. ఇటీవలే గోన్ పురా గ్రామంలో ఓ బాలికను కొంతమంది వేధిస్తుంటే ఆ బాలిక తండ్రి సమాచారం మేరకు వెంటనే ఆ ఊరికి వెళ్లింది అభా దేవి. ఆమె రాకతో ఎక్కడివారక్కడ పరారయ్యారు. చివరికి వారి తల్లిదండ్రుల్ని పిలిపించి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వదిలేసింది అభాదేవి. రివాల్వర్ రాణిగా పాట్నా జిల్లా వాసులకు అండగా నిలబడింది