తెలంగాణ నూతన గవర్నర్‌గా తమిళనాడుకు చెందిన భాజపా మహిళా నేత తమిళిసై సౌందరరాజన్‌ నియమితులయ్యారు. వైద్య వృత్తి నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చిన తమిళిసై సౌందరరాజన్‌ అనతి కాలంలోనే భాజపాలో అగ్రశ్రేణి మహిళా నేతగా ఎదిగారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌లో జూన్‌ 2, 1961న జన్మించారు. ఆమె తండ్రి ప్రముఖ కాంగ్రెస్‌ నాయకుడు కుమారీ ఆనందన్‌ పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. తమిళిసై భర్త సౌందరరాజన్‌ తమిళనాడులో ప్రముఖ వైద్యుడు. భారత వైద్య పరిశోధనా మండలిలో పాలకమండలి సభ్యుడిగా ఉన్నారు.

?విద్యాభ్యాసం?
మద్రాస్‌ వైద్య కళాశాలలో తమిళిసై ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. ఎంజీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయంలో గైనకాలజీలో పీజీ చేశారు. అనంతరం కెనడాలో సోనోలజీ, ఎఫ్‌ఈటీ థెరపీలో ప్రత్యేక శిక్షణ పొందారు. రాజకీయ రంగంలోకి ప్రవేశించడానికి ముందు ఆమె రామచంద్ర వైద్య కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు.

?రాజకీయ ప్రస్థానం?
తండ్రి కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా ఉండడంతో చిన్నతనం నుంచే తమిళిసై రాజకీయాలపై అవగాహన పెంచుకున్నారు. మద్రాస్‌ వైద్య కళాశాలలో చదువుతుండగా.. విద్యార్థి సంఘం నాయకురాలిగా ఎన్నికయ్యారు. తండ్రి కాంగ్రెస్‌లో ఉన్నా తాను మాత్రం భాజపా సిద్ధాంతాలపై ఆకర్షితులయ్యారు. భాజపాలో పూర్తిస్థాయి కార్యకర్తగా చేరి అనేక హోదాల్లో పార్టీకి సేవలందించారు. 1999లో సౌత్‌ చెన్నై జిల్లా వైద్య విభాగం కార్యదర్శిగా, 2001లో రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శిగా, 2005లో ఆల్‌ ఇండియా కో-కన్వీనర్‌ (మెడికల్‌ వింగ్‌ ఫర్‌ సదరన్‌ స్టేట్స్‌)గా, 2007లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 2010లో రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, 2013లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం తమిళనాడు భాజపా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమెను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ గవర్నర్‌గా నియమించింది. దీంతో తెలంగాణ తొలి మహిళా గవర్నర్‌గా ఆమె ఖ్యాతినార్జించారు.

About The Author