40 ఏళ్ల ముందుగానే గుండె జబ్బులు కనుక్కోవచ్చు..!


గుండె జబ్బులను 40 ఏళ్లు ముందుగానే కనుక్కోవచ్చు. ఈ అద్భుత విషయాన్ని న్యూయార్క్‌లోని ప్రముఖ ‘స్లోయాన్‌ కెట్టరింగ్‌ క్యాన్సర్‌ సెంటర్‌’ వైద్యులు ఓ తాజా అధ్యయనంలో తేల్చారు. అది కూడా అతి సాధారణమైన రక్త పరీక్ష ద్వారా కనుక్కోవచ్చట.మందులు అవసరం లేకుండా ఆహార అలవాట్లలో మార్పుల ద్వారా గుండె జబ్బులను నుంచి తప్పించుకోవచ్చని వారు సూచిస్తున్నారు.
యువకుల్లో ‘ఇన్‌ప్లమేషన్‌’ పరీక్ష ద్వారా రానున్న గుండె జబ్బులను ముందుగానే కనుక్కోవచ్చట. ఇన్‌ఫ్లమేషన్‌ రక్త పరీక్ష అంటే టెస్ట్‌ ట్యూబ్‌లోకి రక్తాన్ని తీసుకున్న తర్వాత అందులోని ఎర్ర రక్త కణాలు ఎంత సేపటికి ట్యూబ్‌ అడుక్కు చేరుకుంటాయన్న విషయాన్ని తేల్చడం ద్వారా. దీన్నే వైద్య పరిభాషలో ‘ఎరిత్రోసైట్‌ సెడిమెంటేషన్‌ రేట్‌ (ఈఎస్‌ఆర్‌)’ అని పిలుస్తారు. ఈఎస్‌ఆర్‌ గంటకు 5 నుంచి 15 మిల్లీమీటర్లు ఉంటే మోస్తారుగా ఉన్నట్లు 5 ఎంఎంకన్నా తక్కువుంటే తక్కువగా, 15 ఎంఎం కంటే ఎక్కువగా ఉంటే ఎక్కువగా అంటే అసాధారణగా ఉన్నట్లు గుర్తిస్తారు. ఈ పరీక్ష ద్వారా ఎంత త్వరగా లేదా ఎంత ఆలస్యంగా గుండె జబ్బులతోపాటు క్యాన్సర్‌ వచ్చే ప్రమాదాన్ని కూడా గుర్తించవచ్చని క్యాన్సర్‌ సెంటర్‌ ఎపిడిమియాలజిస్ట్‌ డాక్టర్‌ కాంటోర్‌ తెలిపారు.

తాము 18 ఏళ్ల నుంచి 20 ఏళ్ల లోపు యువకులపై జరిపిన రక్త పరీక్షల్లో వారికి 36 శాతం గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని తేలిందని, ఆపై 57 ఏళ్ల వయస్కుల వారిపై ఇవే పరీక్షలు నిర్వహించగా వారిలో క్యాన్సర్‌ వచ్చే అవకాశం 78 శాతం, కార్డియో వ్యాస్కులర్‌ డిసీస్‌ వచ్చే అవకాశం 54 శాతం ఉన్నట్లు తేలిందని డాక్టర్‌ కాంటోర్‌ వివరించారు. కొన్ని ఏళ్లుగా రెండున్నర లక్షల మందిపై జరిపిన రక్త పరీక్షల ద్వారా తమకు ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని ఆయన తెలిపారు.

About The Author