వంద రోజుల ఇసుక కష్టాలకు ఇక తెరపడింది…
?కాస్త భారమైనా మొత్తానికి ఊరటే
?ప్రభుత్వం లాభపడేలా కొత్త విధానం
?టన్ను రూ.375
?రవాణా చార్జీలు అదనం
?పక్క రాష్ట్రాలకు తరలింపు కుదరదు
?నూతన ఇసుక పాలసీకి కేబినెట్ ఓకే
?ఉచితం రోజుల్లో ట్రాక్టర్ రూ.1600కే
?ఇప్పుడు అదే ఇసుక ధర 2వేలుపైనే
?తొలిరోజు 30 స్టాక్‌పాయింట్ల నుంచి..
దాదాపు వందరోజుల ఇసుక కష్టాలకు ఇక తెర పడనుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానంలో భాగంగా ఇక ఇసుక సరఫరా కానుంది. ఈ మూడునెలలు ఇసుక ధరను చూసినా….ఇసుక కోసం పడిన కష్టాలను చూసినా ప్రజలకు తాజాగా రాష్ట్ర కేబినెట్ తీసుకొన్న నిర్ణయం భారీగానే ఊరట ఇవ్వనుంది. అయితే గత ఎన్నికల ముందు ఉన్న ధరతో పోలిస్తే మాత్రం రేటు పెరగనుంది. గతంలో ఉచిత ఇసుక విధానం అమల్లో ఉండడంతో ట్రాక్టర్ ఇసుక నేరుగా రూ.1600లకు వేసేవారు. ఇప్పుడు టన్ను ఇసుక ధరను రూ.375గా నిర్ణయించారు. ఒక ట్రాక్టరుకు సుమారు 4.5 టన్నుల ఇసుక పడుతుంది. అంటే ఒక ట్రాక్టరు ఇసుక కొనుగోలు కోసమే రూ.1675 చెల్లించాలి.
దీనికి రవాణా చార్జీలు అదనం. 10 కిలోమీటర్ల లోపు ఇసుక రీచ్ ఉంటే రవాణా చార్జీలు రూ.500గా నిర్ణయించారు. అంతకుమించితే రవాణాకు వెయ్యి రూపాయల వరకు పడే అవకాశాలున్నాయి. అంటే గతం కంటే ట్రాక్టరుకు 500-1000వరకు ధర పెరిగే అవకాశం ఉంది. అయితే 10 టైర్ల భారీ లారీల ద్వారా రవాణా చేసుకుంటే రవాణా చార్జీలు కాస్త తగ్గే అవకాశాలున్నాయి. మొత్తంగా చూస్తే కొంతమేర పెరగనున్న ఇసుక ధరలు ప్రజలకు కాస్త భారమైనా…ఆ ఆదాయం ప్రభుత్వానికే లభించనుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కృష్ణా జిల్లా చెవిటికల్లు స్టాక్‌పాయింట్‌లో గురువారం ఉదయం ఇసుక నూతన విధానాన్ని ప్రారంభిస్తారు. ఇసుక బుకింగ్ కోసం ఏర్పాటుచేసిన నూతన వెబ్‌సైట్‌ను కూడా ఆవిష్కరిస్తారు.
*9 నుంచి ట్రాకింగ్.. 12 నుంచి బుకింగ్*
ఇసుక బుకింగ్‌ను మధ్యాహ్నం 12గంటల నుంచి చేసుకునే సౌలభ్యాన్ని గనుల శాఖ కల్పిస్తోంది. ఉదయాన్నే అసలు ఏయే స్టాక్‌పాయింట్లలో ఎంత ఇసుక లభ్యత ఉందన్న విషయాన్ని తీసుకుని… వెబ్‌సైట్‌లో పెడతారు. అనంతరం వెబ్‌సైట్‌లో చూసుకుని ఏ స్టాక్ పాయింట్‌లో ఎంత ఇసుక ఉందనే విషయాన్ని చూసుకుని.. తమకు కావాల్సిన స్టాక్‌పాయింట్ నుంచి బుక్ చేసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న వాహనాలు కూడా కనిపిస్తాయి. తమకు కావాల్సిన వాహనాన్ని ఎంపిక చేసుకుంటే…ఆ వాహనంలో తాము బుక్ చేసుకున్న ఇసుక ఇంటికి వచ్చేస్తుంది. అయితే జీపీఎ్‌సతో అనుసంధానం అయిన వాహనాల్లోనే ఇసుకను రవాణా చేయాలి. ఏ వాహనదారుడైనా ఏపీఎండీసీ అధికారులను సంప్రదించి జీపీఎస్ అనుసంధానం చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలనుంచి ఈ జీపీఎస్ అనుసంధానాన్ని వాహనాలకు చేస్తారు.
*ఉంటే బరువు.. లేదంటే బండి సైజు*
తొలిరోజు దాదాపు 30 స్టాక్ పాయింట్ల నుంచి ఇసుక సరఫరా చేయనున్నారు. వీలునుబట్టి ఒకటి, రెండురోజుల్లోనే మరికొన్ని స్టాక్‌పాయింట్లను కూడా జోడించనున్నారు. గోదావరి, కృష్ణా నదుల్లో వరద నీరు తగ్గితే మొత్తంగా 50స్టాక్‌పాయింట్లు అందుబాటులోకి వస్తాయి. అక్టోబరు నాటికి వీటిని మరిన్ని పెంచనున్నారు. వేబ్రిడ్జిలు, సీసీ కెమెరాలను రీచ్‌లకు పంపినా…వరదల వల్ల బిగించడం ఇబ్బందికరంగా మారింది. అయినా అవి బిగించిన చోట్ల, బరువు ప్రకారం సరఫరా చేస్తారు. లేనిచోట్ల ట్రాక్టరు, లారీలో పట్టే ఇసుక పరిమాణం ఎంతన్నది అంచనా ఉండడంతో దాని ప్రకారం చార్జి చేస్తారు.
క్రమంగా అన్ని రీచ్‌లలోను వే బ్రిడ్జ్‌లు, సీసీ కెమెరాలు బిగిస్తారు. ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా రీచ్‌లు ఇప్పటికీ నీటి ముంపులోనే ఉన్నాయి. దీంతో బోట్స్‌మెన్ అసోసియేషన్‌లతో మాట్లాడి…పడవల మీద ఇసుకను ఒడ్డుకు తేనున్నారు. ఒక క్యూబిక్‌మీటరుకు రూ.217ను బోట్స్‌మెన్ సంఘాలకు చెల్లిస్తారు. మరోవైపు ఇసుక రేవులు, స్టాక్‌పాయింట్ల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. ఔట్‌సోర్సింగ్ ఏజన్సీ ద్వారా ఈ సిబ్బందిని నియమించారు. ఒక రీచ్‌లో ఐదుగురు, ఒక స్టాక్‌పాయింట్‌లో తొమ్మిదిమంది చొప్పున సిబ్బందిని ఏర్పాటుచేశారు