యాదాద్రికి చేరుకున్న మహాద్వారాల తలుపులు, మేళతాళాలతో స్వాగతం పలికిన భక్తులు…


యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణంలో కొత్తగా నిర్మాణం జరుపుకున్న ఆరు మహారాజగోపురాలు, ఒక విమాన గోపురానికి రూ. రెండు కోట్లు వెచ్చించి తయారు చేయించిన భారీ తలుపులు యాదాద్రికి గురువారం సాయంత్రం చేరుకున్నాయి. జాతరను గుర్తు చేసేవిధంగా భారీ వాహనాల్లో తరలివచ్చిన తలుపులను చూడటానికి భక్తులు పోటీ పడ్డారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి తలుపులను తీసుకువస్తున్న వాహనాలకు స్వాగతం పలికారు. కోలాట బృందం సభ్యులతో కలిసి కోలాటమాడి తన ఆనందాన్ని పంచుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎంతో ప్రీతికరంగా నిర్మాణం చేయిస్తున్న నేపథ్యంలో యాదాద్రి ఆలయం నిర్మాణాలు పూర్తి కావస్తుండటంతో రోజుకో తీరున శోభాయమానంగా రూపుదిద్దుకుంటున్నది. ఆరు మహారాజగోపురాలు, ఒక విమాన గోపురం ద్వారాలకు వీటిని బిగించనున్నారు. సికింద్రాబాద్‌లోని అనురాధ టింబర్ డిపో యజమాని చదలవాడ తిరుపతిరావు అనే కాంట్రాక్టర్ ఈ తలుపులు తయారీ చేసే టెండర్ దక్కించుకుని పనులు నిర్వహించారు. సప్తతల రాజగోపురానికి 24X 14 భారీ సైజులో తయారు చేయించారు. అదేవిధంగా మిగతా ఆరు గోపురాలకు 16X 9 సైజులో తయారు చేయించినట్టు వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు తెలిపారు. మహాద్వారాల తలుపులు యాదాద్రికి చేరుకుంటున్నాయని, రోడ్డుకిరువైపులా చేరిన భక్తులు హర్షాతిరేకం వ్యక్తం చేస్తూ అపూర్వస్వాగతం పలికిన వేళ వీక్షించిన ప్రతిఒక్కరూ ఆనందంతో మురిసిపోయారు. తమ ఇలవేల్పు అయిన శ్రీనారసింహుని ఆలయ పునర్నిర్మాణంలో మహాగోపురాల ద్వారాలకు బిగించేందుకు భారీ వాహనంపై తీసుకువస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. యాదాద్రి ప్రధాన రహదారి మొత్తం భక్తజన సమూహంతో నిండిపోయింది. ఆలయ ప్రధానార్చకులు నల్లంతీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులు.. ఎమ్మెల్యే సునీతకు పూలమాల వేసి సత్కరించారు. యాదాద్రి ప్రధాన రహదారి మొత్తం భక్తజన సమూహంతో నిండిపోయింది.

About The Author