నేను భారతీయుడిని.. ఆ తరువాతే ఇంకేదైనా: మీడియాకు ఇస్రో ఛైర్మన్ చురకలు


నేను భారతీయుడిని.. ఆ తరువాతే ఇంకేదైనా: మీడియాకు ఇస్రో ఛైర్మన్ చురకలు!

బెంగళూరు: ఇస్రో ఛైర్మన్ కే శివన్..పరిచయ వాక్యాలు అక్కర్లేని పేరు ఇది. చంద్రయాన్-2 మిషన్ తో దేశవ్యాప్తంగా..ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా మారుమోగిన పేరు.

తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ శివన్ తో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ తీసుకుంది. ఈ ఇంటర్వ్యూ మొత్తం దాదాపుగా తమిళంలో సాగింది. ఆ సమయంలో- సదరు న్యూస్ ఛానల్ విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు శివన్ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇస్రో వంటి గొప్ప సంస్థకు ఓ తమిళుడు ఛైర్మన్ గా వ్యవహరిస్తుండటం గర్వించదగ్గ విషయమని, దీనిపై తమిళనాడు ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తారంటూ ఆ ఛానల్ విలేకరి అడిగిన ప్రశ్నకు శివన్ కాస్త ఘాటుగా బదులు ఇచ్చారు. నేను మొదట భారతీయుడిని. ఆ తరువాతే ఇంకేదైనా. భారతీయుడినని చెప్పుకోవడానికే నేను మొగ్గు చూపుతాను. భారతీయుడిగానే ఇస్రోలో చేరాను. అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని భాషలకు చెందిన వారు ఒకే చోట, సమష్టిగా పనిచేసే సంస్థ ఇస్రో. ఇలా భారతీయులందరితోనూ కలిసి పని చేయడం గర్వంగా ఉంది.. అని సమాధానం ఇచ్చారు.

About The Author