వనపర్తి లో వేరుశనగ పరిశోధన కేంద్రం ఏర్పాటు కాబోతున్నది…


వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి గారి కృషితో వనపర్తి లో వేరుశనగ పరిశోధన కేంద్రం ఏర్పాటు కాబోతున్నది…. మంత్రి గారి ఆదేశాలతో వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు పామిరెడ్డిపల్లి & వీరాయి పల్లి శివార్లలో 25 ఎకరాల భూమిని ఇప్పటికే గుర్తించడం జరిగింది.

కార్యక్రమానికి భారీ గా హాజరైన రైతులు..

వనపర్తిలో వేరుశనగ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. వేరుశనగ పంటకు వనపర్తి జిల్లా నేలలు చాలా అనుకూలంగా ఉన్నాయన్నారు. గురువారం గోపాల్‌పేట పీఏసీఎస్‌ ఆవరణలో ప్రభుత్వం సరఫరా చేస్తున్న రాయితీ వేరుశనగ విత్తనాల పంపిణీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వేరుశనగ పంటను వేసిన ప్రతి రైతూ లాభపడాలన్నారు. రాష్ట్రంలో మొదటిసారిగా గోపాల్‌పేటలోనే విత్తన పంపిణీని ప్రారంభించామని, ఇక్కడి రైతులు దుక్కిలు దున్ని విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు
మంచి భూముల్లో ఇప్పుడు రైతులు ఎకరాకు 12, 13 క్వింటాళ్ల వేరుశనగను పండిస్తున్నారన్నారు. 20 క్వింటాళ్ల దిగుబడిని రైతులు సాధించాలన్నారు. విత్తనాలు బాగుంటేనే పంటల దిగుబడీ ఎక్కువగా వస్తుందన్నారు. వనపర్తి జిల్లాలో విత్తన పరిశోధన కేంద్రం ఏర్పాటుకు సుమారు 25 ఎకరాల భూమి కావాలని జిల్లా కలెక్టరుతో చెప్పానన్నారు. క్వింటాలు వేరుశనగ విత్తనాల ధర రూ.9వేలు ఉండగా.. ప్రభుత్వం రైతులకు రూ.5వేలకే అందిస్తోందని మంత్రి తెలిపారు. రాయితీ విత్తనాలు పక్కదారి పట్టకుండా చూడాలని, రైతులు పొలంలో వేశారో.. లేదో.. వీఆర్వోలు, ఏఈవోలు పరిశీలించి కలెక్టరుకు నివేదించాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, అందుకే బడ్జెట్లో వ్యవసాయశాఖకు ఎక్కువ కేటాయించారన్నారు. జిల్లా కలెక్టరు శ్వేతా మహంతి మాట్లాడుతూ.. పరిశోధన కేంద్రానికి పామిరెడ్డిపల్లి, వీరాయపల్లి శివారుల్లో 25 ఎకరాలను గుర్తించినట్లు తెలిపారు. జిల్లాలో వేరుశనగ ఎక్కువగా పండిస్తారని, ఇక్కణ్నుంచి గుజరాత్‌, ముంబయికి తరలిస్తున్నారన్నారు. తెలంగాణ విత్తన కార్పొరేషన్‌ ఎండీ డా.కేశవులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ జిల్లావారూ వేరుశనగ విత్తనాలు కావాలని అడగలేదన్నారు. వనపర్తి జిల్లానుంచే విత్తనాలు కావాలని కోరారన్నారు. మన దగ్గరున్న విత్తనాలను పంపిణీ చేస్తూనే రాష్ట్రానికి అవసరమైన వాటిని టెండర్లద్వారా కొని పంపిణీ చేస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి రైతులకు కావాల్సిన విత్తనాలను ఇక్కడే పండించేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నామన్నారు.

About The Author