దిగోచ్చిన మెట్రో… బాధితురాలి కుటుంబానికి రూ.20 లక్షల నష్టపరిహారం
అమీర్పేట్ మెట్రో స్టేషన్ ఘటనపై అధికారులు ఎట్టకేలకు దిగివచ్చారు. ప్రమాదంలో మృతిచెందిన మౌనిక కుటుంబానికి నష్టపరిహారం చెల్లించేందుకు హామీ ఇచ్చారు. మౌనిక కుటుంబానికి 20 లక్షల రుపాయల నష్టపరిహారంతో పాటు, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకరించారు. అధికారుల హమీతో కుటుంబ సభ్యులు తమ ఆందోళనను విరమించారు.ఆదివారం సాయంత్రం అమీర్పేట్ మెట్రో రైల్వే స్టేషన్లో పైకప్పు పెచ్చులూడి మౌనిక అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే…అయితే ఈ సంఘటనపై మెట్రో అధికారులు నిర్లక్ష్యం వహించారు. సంఘటనపై తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే బాధిత కుటుంబానికి కనీసం సానుభూతి కూడ ప్రకటించలేని పరిస్థితిలోకి వెళ్లారు. మరోవైపు ఇన్సూరెన్స్ డబ్బులు మాత్రమే చెల్లిస్తామని ఖరాఖండిగా తెలిపారు.దీంతో మౌనిక కుటుంబసభ్యులు ఆందోళన బాటపట్టారు. బేగంపేట్ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. మౌనిక మృతికి బాద్యత వహిస్తూ అధికారులపై చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. దీంతో పాటు 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించడంతో పాటు మృతురాలి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీరికి తోడు పలు పార్టీల నేతలు సైతం అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రో. కోదండరాం సైతం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి అనంతరం నష్టపరిహారం చెల్లించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. దీంతో దిగివచ్చిన మెట్రో అధికారులు బాధితురాలి కుటుంబానికి 20 లక్షలు చెల్లించడంతో పాటు, ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు