పేటియం చెల్లింపులతో తస్మాత్ జాగ్రత్త
న్యూఢిల్లీ: వంద రూపాయల రీఫండ్ కోసం ప్రయత్నించిన ఓ జుమాటో కస్టమర్ ఏకంగా రూ.77 వేలు పోగొట్టుకున్న వైనమిది. చూస్తుండగానే బ్యాంకు ఖాతా మొత్తం తుడిచిపెట్టుకుపోవడంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. పాట్నాకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విష్ణు ఈనెల 10న ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జుమాటో నుంచి రూ.100 చెల్లించి ఆహారం ఆర్డర్ చేశాడు. పార్శిల్ ఇంటికి రాగానే ఆహారం బాగోలేదని గుర్తించి వెనక్కి పంపేందుకు ప్రయత్నించాడు. అయితే డబ్బులు తిరిగి రావాలంటే జుమాటో కస్టమర్ కేర్‌ని సంప్రదించి ఆన్‌లైన్ ద్వారా రీఫండ్ కోసం అప్లై చేసుకోవాలని డెలివరీ బాయ్ సూచించాడు.
‘జుమాటో కస్టమర్ కేర్’ కోసం గూగుల్‌లో వెదికిన విష్ణు… ఓ ప్రమాదకర లింకును క్లిక్ చేశాడు. అందులో ఉన్న ఓ నంబర్‌కి ఫోన్ చేసి రీఫండ్ గురించి ఆరా తీశారు. రూ.100 రీఫండ్ కావాలంటే ఓ ఖాతాలో పది రూపాయలు డిపాజిట్ చేయాలంటూ అవతలి నుంచి వినిపించింది. వెనకాముందూ ఆలోచించకుండా వాళ్లు చెప్పినట్టు చేసిన విష్ణు… పది రూపాయలు డిపాజిట్ చేయడానికి ఓ హానికర లింకును క్లిక్ చేశాడు. అంతే నిమిషాల్లో ఆయన ఖాతా నుంచి రూ.77 వేలు మాయమయ్యాయి. పేటీఎం ద్వారా మోసపూరిత లావాదేవీలతో నిందితులు విష్ణు ఖాతాను ఖాళీ చేసినట్టు పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.