గ్రామ సచివాలయ పోస్టుల ధృవపత్రాల పరిశీలన ప్రారంభం


శ్రీకాకుళం, సెప్టెంబరు 25 : గ్రామ సచివాలయ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధుల ధృవపత్రాల పరిశీలన బుధ వారం జిల్లాలో ప్రారంభం అయింది. జిల్లాలో నిబంధనల మేరకు వివిధ పోస్టులకు తయారు చేసిన మెరిట్ జాబితా ఆధారంగా అభ్యర్ధులకు కాల్ లెటర్లు జారీ చేసిన సంగతి విధితమే. వ్యవసాయ, మత్స్య, పశుసంవర్ధక, ఉద్యానవన, సెరీకల్చర్, డిజిటల్ సహాయకుల పోస్టుల జాబితాను తయారు చేసి అభ్యర్ధులకు ఎస్.ఎం.ఎస్., ఇ – మెయిల్ లను పంపించారు. పూర్తి చేసిన పోస్టుల జాబితాలను srikakulam.ap.gov.in వెబ్ సైట్ లోను పొందుపరచడం జరిగింది.
బుధ వారం ప్రారంభమైన ధృవపత్రాల పరిశీలన కార్యక్రమంను జిల్లా కలెక్టర్ జె నివాస్ పరిశీలించారు. శివానీ ఇంజనీరింగు కళాశాలలో జరుగుతున్న పశుసంవర్ధక సహాయకులు, గాయత్రి కళాశాలలో జరుగుతున్న మత్స్య, సెరీకల్చర్, వ్యవసాయ, ఉద్యానవన సహాయకులు పోస్టుల ధవపత్రాల పరిశీలన కార్యక్రమాన్ని తనిఖీ చేసి సంబంధిత పరిశీలన బృందాలకు తగు ఆదేశాలు జారీ చేసారు. అభ్యర్ధులు తమ వద్ద ఉన్న ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు రెండు జెరాక్సు కాపీల సెట్లను తీసుకురావాలని కలెక్టర్ అన్నారు. ప్రస్తుతం అభ్యర్ధుల వద్ద ఉన్న కుల ధృవీకరణ పత్రంను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. పొరపాటున అభ్యర్ధులు తమ ధృవీకరణ పత్రాలలో తేవడంలో చేసిన పొరపాట్లు ఉంటే వారి నుండి వ్రాతపూర్వకంగా డిక్లరేషన్ తీసుకుని సమయం ఇవ్వాలని అన్నారు. అభ్యర్ధులకు ఎటువంటి సమస్యలు లేకుండా సులభ ప్రక్రియలో పరిశీలన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి 2419 మంది అభ్యర్ధులకు కాల్ లెటర్సు పంపించామని, దులో 2014 మంది డౌన్ లోడ్ చేసుకున్నారని చెప్పారు. కాల్ లెటర్స్ అందుకున్న వెంటనే ఒరిజినల్ సర్టిఫికేట్లను అప్ లోడ్ చేయాలని అన్నారు. అక్టోబరు 2వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాలు ప్రారంభం అవుతాయని, ఆనాటికి భర్తీ ప్రక్రియ పూర్తి చేయుటకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 50 మంది అభ్యర్ధుల సర్టిఫికేట్లను పరిశీలించుటకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసామని అన్నారు. శివాని ఇంజనీరింగు కళాశాలలో – పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, వి.ఆర్.ఓలు, ఏ.ఎన్.ఎం, పశుసంవర్ధక అసిస్టెంట్ల పరిశీలన., శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగు కళాశాలలో – గ్రామ సర్వేయర్, విద్య- సంక్షేమ సహాయకులు, అన్ని మునిసిపాలిటీల వార్డు సచివాలయానికి చెందిన అన్ని పోస్టులకు పరిశీలన., గాయత్రి డిగ్రీ కళాశాలలో – మత్స్యశాఖ, సెరీకల్చర్, వ్యవసాయ, ఉద్యానవన అసిస్టెంట్ల పోస్టులు, మహిళా ప్రొటెక్షన్ అధికారి, ఇంజనీరింగు అసిస్టెంట్ల పోస్టులకు పరిశీలన ఉంటుందని వాటిలో మార్పు లేదని కలెక్టర్ వివరించారు. అభ్యర్ధుల గ్రామ సచివాలయం వెబ్ సైట్ లో సైతం తమ కాల్ లెటర్స్ ను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి ఎం.వి.రమణ, పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా.ఏ.ఈశ్వర రావు, ఉప సంచాలకులు డా.జగన్నాథం, తహశీల్దారు ఎస్.సుధాసాగర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
సహాయ సంచాలకులు, సమాచార పౌరసంబంధాల శాఖ, శ్రీకాకుళం

About The Author