ఇష్ట కామేశ్వరీ… శ్రీశైల నల్లమల్ల దట్టమైన అడవిలో


శ్రీశైల నల్లమల్ల దట్టమైన అడవిలో వెలిసిన స్వయంభూ ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించి పూజించిన వారికి 41 రోజుల్లో కోరిన కోర్కెలు తీరతాయని నమ్మకం. కానీ.. అందరూ ఈ అమ్మ వారిని దర్శించలేరు, అమ్మ ఆనతి ఉండి ఆమె తన వద్దకు పిలుపించుకుంటుందని ఆమె అనుగ్రహం లేనిదే అమ్మవారు ఉన్న ప్రాంతం చేరుకోలేరు. పార్వతీ పరమేశ్వరులలో ఉన్నటువంటి అమ్మవారి తత్త్వానికి కామేశ్వరి అని పేరు. చాలా కాలం క్రితం శ్రీశైల నల్లమల్ల దట్టమైన అడవులలోకి చెంచులు తేనే, చింతపండు వంటి వాటి సేకరణ కు అడవిలో తిరుగుతుండగా అద్బుతమైన ఇష్టకామేశ్వరి అమ్మవారి విగ్రహం దర్శనంఅయ్యింది. అమ్మను భక్తితో కొలిచి, వారు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి పూజలు జరిపారని, అప్పడి నుండి ఇప్పటికీ వారి సంతతి వారే ఆలయ అర్చకులుగా వ్యవహరి‌అస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
ఇక్కడ వెలసిన అమ్మవారు చతుర్భుజి. అమ్మ నాలుగు చేతులతో ఉంటుందట. రెండు చేతులతో లక్ష్మీ దేవి ఎలా తామరమొగ్గలు పట్టుకుంటుందో అలా తామర మొగ్గలు పట్టుకొని ఉంటుంది. ఒక చేతిలో రుద్రాక్షమాల, ఒక చేతిలో శివలింగాన్ని పట్టుకొని యోగినీ స్వరూపంలో ఉంటుంది. ఎంత గొప్ప కోర్కె తీరాలన్న వాళ్ళైనా సరే తపస్సు భంగం అయిపోతోంది అనుకున్న వాళ్ళు కూడా శ్రీశైలం అడవుల్లో తపస్సు చేస్తే కోరిక ఫలించి స్వామివారు కరుణిస్తారు అని పురాణ కాలం నుండి పురాణ గాధలు ఉన్నాయి. ఈ మహిమ కేవలం ఉత్తరభారతదేశంలో కాశీ పట్టణానికి ఉంది. దక్షిణ భారతదేశం మొత్తం మీద శ్రీశైల క్షేత్రానికి మాత్రమే ఉంది ఇలాంటి పుణ్యస్థలి శ్రీశైలానికి 20 కిలోమీటర్ల దూరంలో అడవుల్లో వెలసిన ఇష్ట కామేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కోరుకుంటే కోరిన కోర్కెలు తీర్చుతుందని భక్తులు చెపుతుంటారు.
అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పురాతన గణేష్ విగ్రహం సందర్శించవచ్చు, ఇప్పటికి ఈ ప్రాంతంలో కొందరూ సాధువులు ఇక్కడే ఉంటూ అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. పచ్చని అడవి, పక్షుల కిలకిల రావాలు, మధ్యలో వాగులు, వంకలతో అద్బుతంగా ఈ ప్రాంతం కు వెళ్లే మార్గం అతి ఆహ్లాదంగా ఉంటుంది. అమ్మవారిని దర్శించి పూజించిన 41 రోజులకు అనుకున్నవి జరుగుతాయని ఇలా జరిగిన చాలా ఆధారాలు ఉన్నాయని అమ్మను దర్శించిన భక్తులు చాలా మంది చెపుతూ ఉంటారు. ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించాలనునే ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు, అమ్మవారి కృప ఉంటేనే ఆమె ఇక్కడ దర్శనానికి రప్పించుకుంటుందని చెపుతారు. అమ్మవారికి ఇక్కడ మనమే నేరుగా అభిషేకం చేయవచ్చు

ఇక్కడ స్పర్శవేది చేత ఒకప్పుడు సిద్ధ నాగార్జునుడు శ్రీశైలం కొండనంతటినీ కూడా బంగారం కొండగా మార్చే ప్రయత్నం చేశాడు. ఆయనే మూలికల మూట తెచ్చి త్రిఫల వృక్షం క్రింద పెట్టాడు. అటువంటి గొప్పగొప్ప ఔషద వృక్షాలు ఈ నల్లమల్ల అడవుల్లో, శ్రీశైల పర్వతం మీద ఉన్నాయి. ఇక్కడ అమ్మవారి రాతి విగ్రహం కు బొట్టు పెడితే నుదురు మనిషి వోలే మెత్తగా మనకు స్పురిస్తుంది అమ్మవారి పక్కనే శివాలయం ఉండేది. కానీ గుప్తనిధుల ఆశలో ధూర్తులు శివలింగాన్ని కూడా పెళ్ళగించేశారు. ఆ ప్రదేశంలో ఇప్పటికీ పెద్ద గొయ్యి ఉంటుంది. ఈ పవిత్ర ప్రాంతంలో కాసేపు కళ్ళుమూసుకొని కూర్చుంటే సెలయేళ్ళ ప్రవాహం చేత ధ్యానమునకు అత్యంత యోగ్యమైనదిగా ఉంటుంది. కాపాలికుల దగ్గరి నుంచి సాక్షాత్తు శ్రీ శంకరుల వరకు ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయో శైవంలో అన్ని ఉన్నాయి.

ఈ మాతను దర్శించాలనుకునే వారు వారు సూర్యోదయమయిన తర్వాత జీపులు మాట్లాడుకుని వెళ్తే మంచిది.. స్వంత వాహనాలున్నా సరే .. స్వంత వాహనాలలో వెళ్ళే ధైర్యం అస్సలు చేయకండి. ప్రస్తుతం ఇష్టకామేశ్వరి అమ్మవారు ఉన్న ప్రాంత సందర్శనను ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వారు కొన్ని భధ్రతా కారణాలు, వన్య ప్రాణుల రక్షణ దృష్ట్యా నిలిపి వేసారు. ఈ మాత దర్శనానికి అనుమతి తప్పని సరి

శ్రీశైలం నుండి దోర్నాల కు వెళ్లే దట్టమైన అడవిలో ఉన్న ఈ క్షేత్రానికి జీపులు మాత్రం వెళ్తాయి. అది కూడా గుండె దిటవు వున్నవాళ్ళు అయితేనే వెళ్ళగలరు. ఎందుకంటే రోడ్డు చాలా అధ్వాన్నంగా ఉంటుంది. అంతా డొంకరోడ్డు(అసలు దానిని రోడ్డు అనేదానికి వీలులేదు) ఆలయం దట్టమైన అడవి మధ్యలో ఉంటుంది. కొంతదూరం మాత్రమే వాహనాలు వెళ్తాయి, దట్టమైన అడవిలో దాదాపు 5 కిలోమీటర్ల పైనే నడవాలి.

About The Author