అడ్డగోలుగా దోచేసారు… టీవి9 మాజీ సీఈవో, డైరెక్టర్లపై అలందా మీడియా ఫిర్యాదు…


టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌, మాజీ డైరెక్టర్లు కేవీఎన్‌ మూర్తి, క్లిఫర్డ్‌ పెరేరియాలు ABCL కంపెనీ నుంచి అక్రమంగా ₹18,31,75,000 అక్రమంగా తమ ఖాతాలకు మళ్ళించారని అలందా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్ (టీవీ9 కొత్త యాజమాన్య సంస్థ) ఆరోపించింది.

అలందా సంస్థ శుక్రవారం బంజారా హిల్స్ పోలీస్‌ స్టేషన్‌ లో ఇచ్చిన ఫిర్యాదులో అక్రమ నిధుల బదిలీ వివరాలను తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్‌ 18వ తేదీ నుంచి ఈ ఏడాది మే 8వ తేదీ వరకు పలు విడతలుగా ₹18.31 కోట్లు ABCL కంపెనీ ఖాతాల నుంచి ఈ ముగ్గురు డైరెక్టర్ల ఖాతాలకు తరలినట్లు అలందా పేర్కొంది.

ఇందులో టీడీఎస్‌ పోను ₹11,74,51,808 కోట్లు నికరంగా ఈ ముగ్గురు ఖాతాలకు వెళ్ళాయని కంపెనీ పేర్కొంది. బోనస్‌/ఎక్స్‌గ్రేషియా రూపంలో వీరు ఈ మొత్తాన్ని కంపెనీ నుంచి తీసుకున్నారని పేర్కొంది.

కంపెనీ రెండేళ్ళ లాభానికి ఈ మొత్తం సమానమంటూ… ఈ మొత్తం నిధుల జారీకి బ్యాంక్‌ ఆథరైజ్డ్‌ సిగ్నేటరీలుగా వి. రవిప్రకాష్‌, ఎంకేవీఎన్‌ మూర్తి ఉన్నారని అలందా ఆరోపించింది. బోనస్‌/ఎక్స్‌గ్రేషియాకు కంపెనీ డైరెక్టర్లు, బోర్డు లేదా వాటాదారుల అనుమతి లేదని తమకు ఉన్న చెక్‌ పవర్‌ను దుర్వినియోగం చేసి అక్రమ మార్గంలో భారీ మొత్తాన్ని తమ ఖాతాలోకి జమ చేసుకున్నారని అలందా కంపెనీ తన ఫిర్యాదులో పేర్కొంది.

సెప్టెంబర్‌ 24వ తేదీన జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఈ నిధుల బదిలీ గురించి చర్చించి.. వీరిపై కేసు నమోదు చేసి న్యాయపరంగా ముందుకు వెళ్ళాలని నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది.

గత ఏడాది ఆగస్టు 27వ తేదీన అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌(ABCL)లో అలందా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 90.54 శాతం వాటాను కొనుగోలు చేసింది.

About The Author