గ్రేటర్ హైదరాబాద్ లో పారిశుధ్య కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా…


గ్రేటర్ హైదరాబాద్ లో పారిశుధ్య కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా నిర్వహించడం, ప్రతి వార్డు, సర్కిళ్లవారిగా శానిటేషన్ ప్రత్యేక ప్రణాళికలు రూపకల్పన, పారిశుధ్య కార్మికుల సంక్షేమం, నగర శివార్లలో డంపింగ్ యార్డ్, భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్లకు కావాల్సిన స్థలాలను ఎంపిక చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ లో శానిటేషన్ నిర్వహణ, రవాణా, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్, జవహర్ నగర్ క్యాపింగ్, ట్రాన్స్ ఫర్ స్టేషన్ల నిర్వహణ తదితర అంశాలపై జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో మంత్రి నేడు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
నగర మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్ లోకేష్ కుమార్ లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కె.టి.రామారావు మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ లో రహదారులు, పారిశుధ్య నిర్వహణకు తగు ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. పారిశుధ్య కార్యక్రమాలకు హైదరాబాద్ లో 18వేల మంది సిబ్బంది కృషి చేస్తున్నప్పటికీ నగరంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ మరింత మెరుగు పర్చవలిసిన అవసరం ఉందని అన్నారు. అయితే దాదాపు కోటి మందికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో మెరుగైన పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకుగాను నగరవాసుల భాగస్వామ్యం మరింత పెంచాల్సి ఉంటుందని సూచించారు. ముఖ్యంగా స్వయం సహాయక బృందాలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, స్వచ్ఛంద సంస్థలకు శానిటేషన్ రంగంలో భాగస్వామ్యం కల్పించాలని పేర్కొన్నారు. నగరంలో గార్బేజ్ ను తరలించే ప్రస్తుత వాహనాల స్థానంలో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనల అనుసరించి ఆధునిక యంత్రాలను ప్రవేశపెట్టేందుకు తగు చర్యలు చేపట్టాలని జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ లో హెల్త్ క్యాలెండర్ ను రూపొందించాలన్నారు. జిహెచ్ఎంసిలో పనిచేసే పారిశుధ్య కార్మికుల వ్యక్తిగత అవసరాలైన వైద్య పరీక్షలు, బీమా సౌకర్యం, వ్యక్తిగత శుభ్రతకై అందించే చేతి గ్లౌజులు, మాస్కులు ఇతర వస్తువులను అందజేయడంతో పాటు కార్మికుల్లో మరింత ఉత్సాహం కలిగేలా కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు.
క్షేత్రస్థాయి పర్యటనలో జిహెచ్ఎంసి సిబ్బందితో పాటు అధికారులందరూ విధిగా జిహెచ్ఎంసి జాకెట్ లను ధరించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం నగరంలో పనిచేస్తున్న 17 గార్బేజ్ ట్రాన్స్ ఫర్ స్టేషన్లను ఆధునీకరించాలని అన్నారు. నగరంలో స్వచ్ఛ ఆటోల ద్వారా గార్బేజ్ సేకరణకు సంబంధిత పరిధిలోని ఇళ్లకు మ్యాపింగ్ చేయాలని, ప్రస్తుతం ఉన్న స్వచ్ఛ ఆటోలకు అదనంగా ఎలక్ట్రిక్ వాహనాలను సమకూర్చుకోవాలని అన్నారు.

దీపావళికి జీడిమెట్ల సి అండ్ డి ప్లాంట్ ప్రారంభం.

జీడిమెట్లలో ఏర్పాటు చేసిన భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ ను దీపావళి సందర్భంగా ప్రారంభించనున్నట్టు పురపాలక శాఖ మంత్రి కె.టి.ఆర్ తెలిపారు. ఈ నెల 27 లేదా 28 తేదీలలో దీనిని ప్రారంభిస్తామని అన్నారు. ఫతుల్లాగూడలో ఏర్పాటు చేయనున్న సి అండ్ డి ప్లాంట్ కేంద్రానికి రహదారి ఏర్పాటు సమస్యను వెంటనే పరిష్కరించాలని కమిషనర్ ను ఆదేశించారు. నగరంలో 160 కోట్ల వ్యయంతో చేపట్టిన జవహర్ నగర్ క్యాపింగ్ పనులు దాదాపుగా పూర్తి అవుతున్నాయని తెలిపారు. నగరానికి అన్ని ప్రక్కల డంపింగ్ యార్డ్ లు, భవన నిర్మాణ రీసైక్టింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు స్థలాలను సేకరించి జిహెచ్ఎంసికి అందజేయాలని జిల్లా కలెక్టర్లను కోరారు. మున్సిపల్ రంగంలో ఆధునిక విధానాలు, వినూత్న పద్దతులను ప్రోత్సహించేందుకు త్వరలోనే నగరంలో అర్బన్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి ప్రకటించారు. ఈ సమావేశంలో జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్లు శృతిఓజా, సుజాత గుప్త, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, జోనల్ కమిషనర్లు హరిచందన, ముషారఫ్ అలీ, శంకరయ్య, శ్రీనివాస్ రెడ్డి, మమత, మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి, సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు, హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ జి.రవి, రంగారెడ్డి ఇన్ చార్జీ కలెక్టర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.

About The Author