తిరుపతి రైల్వేస్టేషన్ 300 కోట్లతో అభివృద్ధి
తిరుపతి: తిరుపతి రైల్వేస్టేషన్‌లో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ప్రణాళికలు రచిస్తున్నట్టు రైల్వేబోర్డు ఛైర్మన్ వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ను సందర్శించిన సందర్భంగా ఆయన .. తిరుపతి స్టేషన్‌లో సెల్‌ఫోన్ ఛార్జింగ్ యూనిట్లను ప్రారంభించారు. అనంతరం స్మార్ట్ రైల్వే ప్రాజెక్టు పనులపై ఉన్నతాధికారులతో చర్చించారు. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రైల్వేబోర్డు ఛైర్మన్‌ను కలిసి రైల్వే ప్రాజెక్టు సమస్యలపై వినతిపత్రం అందించారు. చంద్రగిరి రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయటం ద్వారా సమస్యలను అధిగమించవచ్చని ఎంపీ సూచించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ వినోద్‌కుమార్ మాట్లాడుతూ… రూ.300కోట్లతో తిరుపతి రైల్వేస్టేషన్‌లో అదనపు ప్లాట్‌ఫాంలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. స్మార్ట్ రైల్వేస్టేషన్ ప్రాజెక్టుకు ఎదురైన భూ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించామన్న ఆయన… అన్ని అవాంతరాలను అధిగమించి అతి త్వరలో టెండర్ల దశకు వెళ్తామన్నారు.