కూతురి శవాన్ని పూడ్చబోతే.. కుండలో ‘సీత’ దొరికింది
ఉత్తరప్రదేశ్లో రామాయాణ కాలం నాటి రోజులను గుర్తుకు తెచ్చే ఘటన జరిగింది. పిల్లలు లేని జనక మహారాజు భూమిని దున్నుతుండగా సీతాదేవి భూమిలోంచి ఓ పెట్టెలో లభించినట్టు.. తాజాగా ఓ జంటకు భూమిని తవ్వగా కుండలో ఓ చిన్నారి కనిపించింది. స్మశానంలో భూమిలోపల బతికి ఉన్న చిన్నారిని చూసి ఆ దంపతులు నిర్ఘాంతపోయారు. వెంటనే చిన్నారికి పాలు పట్టించి చికిత్స కోసం ఆమెను హాస్పిటల్కు తరలించారు. ఈ విషయం తెలిసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బరేలీలో ఎస్సైగా పనిచేస్తున్న వైశాలి ఇటీవల నెలలు నిండకుండానే ఓ ఆడబిడ్డను ప్రసవించింది. అయితే ఆ చిన్నారి పురిట్లోనే మరణించడంతో బిడ్డను పాతిపెట్టేందుకు ఆమె భర్త హితేష్ కుమార్ శిరోహి స్మశానంలో గుంతను తవ్వడం ప్రారంభించారు. మూడు అడుగులు తవ్విన తర్వాత అందులోంచి ఓ మట్టి కుండ బయటపడింది. వెంటనే దాన్ని తెరచి చేడగా.. ఓ చిన్నారి కనిపించింది. వెంటనే పాలు పట్టించి చికిత్స కోసం హాస్పిటల్కు తీసుకెళ్లారు. విషయం తెలిసిన స్థానిక ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా పాప చికిత్స కోసం కావాల్సిన ఖర్చు భరించేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆ బిడ్డ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు దర్యాప్తు ప్రారంభించారు. బతికుండగానే చిన్నారిని ఎవరు పూడ్చిపెట్టారు. ఆమె తల్లిదండ్రులు ఎవరనేది గుర్తించే పనిలో పడ్డారు.