ప్రమాదం అంచులో పాకిస్థాన్…?


ఉ్రగవాదులపై చర్యల విషయంలో కపట నీతిని ప్రదర్శిస్తున్న పాకిస్థాన్‌ పరిస్థితి ప్రమాదపుటంచులకు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక మూలాలను నిరోధించే ఆర్థిక చర్యల కార్యదళం(ఎఫ్‌ఏటీఎఫ్‌) పాక్‌పై కఠిన చర్యలకు పూనుకుందని సమాచారం. ప్రస్తుతం ప్యారిస్‌లో ఎఫ్‌ఏటీఎఫ్ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశానికి హాజరైన అధికారులకు ఉన్న సమాచారం ప్రకారం.. పాక్‌కు మద్దతుగా ఏ ఒక్క సభ్య దేశం ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఎఫ్‌ఏటీఎఫ్‌ సిఫార్సులను పాక్‌ అమలుచేయకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. మొత్తం 27 సిఫార్సుల్లో కేవలం ఆరింటిలో మాత్రమే పురోగతి సాధించిందని దీంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు.
ఈ క్రమంలో చివరి అవకాశంగా పాక్‌ను ‘డార్క్‌ గ్రే లిస్ట్‌’లో చేర్చే అవకాశం ఉందన్నారు.
‘బ్లాక్‌ లిస్ట్‌’కి ‘గ్రే లిస్ట్‌’కి మధ్యలో ఉండేదే ‘డార్క్‌ గ్రే లిస్ట్’. అంటే బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చడానికి ముందు దశ. పాక్‌ తన వైఖరిని మార్చుకోవడానికి చివరి అవకాశం కల్పించేందుకు ఎఫ్‌ఏటీఎఫ్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిపై అక్టోబర్‌ 18న తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.
నిషేధిత ఉగ్రవాదులు, సంస్థల విషయంలో చేసిన సిఫార్సులను కచ్చితంగా అమలు చేయాలని ఎఫ్‌ఏటీఎఫ్‌ స్పష్టం చేసింది. 27 సూత్రాలతో ఒక కార్యాచరణ ప్రణాళికను ఇచ్చింది. అయినా పాక్‌ ఎలాంటి పురోగతి కనబరచకపోవడంతో గ్రే లిస్ట్‌లో పెట్టాలని నిర్ణయించింది. దీనిపై గత ఏడాది అక్టోబర్‌లో తొలిసారిగా సమీక్ష జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండోసారి సమీక్ష నిర్వహించినప్పటికీ.. పాక్‌ వైఖరిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఎఫ్‌ఏటీఎఫ్‌కు చెందిన ఆసియా-పసిఫిక్‌ గ్రూప్‌ బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చాలని సిఫార్సు చేసింది. దీనిపై తాజాగా జరుగుతున్న ప్లీనరీ సమావేశాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న పాక్‌ను డార్క్‌ గ్రే లిస్ట్‌లో చేర్చితే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లే అవుతుంది.

About The Author