అర్దరాత్రి కాలనీలలో తిరుగుతున్న ఆరుమంది దొంగలు అరెస్ట్
హైదరాబాద్: అర్ధరాత్రి కాలనీల్లో తిరుగుతూ… తాళం వేసి ఉన్న ఇండ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురిని మీర్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు కరడుగట్టిన పాత నేరస్థులు ఉన్నారు.
నిందితుల నుంచి రూ. 9 లక్షల విలువచేసే 12 తులాల బంగారు ఆభరణాలు, 4 కేజీల వెండి వస్తువులు, ఎల్ఈడీ టీవీ, 2 సోనీ హ్యాండ్ కెమెరాలు, 2 బైకులు, 2 సెల్ఫోన్లు, రూ. 40 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. మీడియా సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ వివరాలను వెల్లడించారు. డీసీపీ మాట్లాడుతూ.. నల్గొండ జిల్లా, నేరేడుగొమ్మ మండలం, ఎర్రగుంట తండాకు చెందిన ఇంద్రావత్ సురేశ్ అలియాస్ ఇస్లావత్ సురేశ్ (23) ప్రస్తుతం నందనవనం, వాంబేకాలనీలో నివాసముంటూ ఫ్రూట్షాపులో పని చేస్తున్నాడు.నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట మండలం, లింగాల గ్రామానికి చెందిన జటావత్ సంతోశ్‌నాయక్(26) ఛత్రినాక, రక్షాపురంలో నివాసముంటూ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరు పాత నేరస్థులు. గతంలో పలుమార్లు దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చారు. జైలు నుంచి వచ్చిన అనంతరం వారు.. మెదక్ జిల్లా, టెక్మాల్ మండలం, పొగులంపల్లి గ్రామానికి చెందిన కట్రోత్ రమేశ్ , నల్గొండ జిల్లా, నేరేడుగొమ్మ మండలం, తిమ్మాపూర్ గ్రామం, బుదంతండాకు చెందిన నేనావత్ సచిన్, సంతోష్‌నగర్‌కు చెందిన పోలెం అరుణ్‌కుమార్ అలియాస్ లల్లు, సరూర్‌నగర్, బైరామల్‌గూడకు చెందిన సంతోజి శ్రీను(30)లతో ముఠాను ఏర్పాటు చేశారు. ఈ నలుగురు నగరంలోనే ఉంటున్నారు. ఈ ఆరుగురు అర్ధరాత్రి సమయాల్లో కాలనీల్లో తిరుగుతూ… తాళం వేసి ఉన్న ఇండ్లలో దొంగతనానికి పాల్పడుతున్నారు. మీర్పేట్ పీఎస్ పరిధిలో 9, సరూర్‌నగర్‌లో 1, వనస్థలిపురం లో 2, ఎల్బీనగర్లో 1, చైతన్యపురిలో 1, సైదాబాద్‌లో 1, హయత్‌నగర్ పీఎస్ పరిధిలో 2 ఇండ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించారు. కాగా.. బుధవారం ఉదయం మీర్పేట్, నందిహిల్స్ వద్ద పోలీసులు వాహన తనఖీలు చేపట్టారు. అదే సమయంలో రెండు బైక్‌లపై వచ్చిన ఆ ఆరుగురు అనుమానాస్పదంగా కనపడగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దొంగతనాల విషయం బయటపడిందని డీసీపీ తెలిపారు.