శ్రీకార్తీక పురాణము 15వ అధ్యాయము
దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూపమందుట
ఈ మాసంలో హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణము చదువుట, వినుట, సాయంకాలము దేవతాదర్శనము విటిని చేయని వారు కాలసుత్రమనెడి నరకంలో పడి కొట్టుమిట్టడుతారు. కార్తీక శుద్ధ ద్వాదశీ దినమున మనసార శ్రీహరిని పూజించినవారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవెద్యములను ఇచ్చిన యెడల విశేష ఫలము పొందగలరు. ఈ విధంగా నెలరోజులు విడువక చెసిన యెడల అట్టివారు దేవదుందుభులు మ్రోగుతుండగా విమానమెక్కి వైకుంఠనికి పోవుదురు. నెల రోజులు చేయలేనివారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునెయ్యితో దీపమును వుంచవలెను.
ఈ మహాకార్తీకంలో ఆవుపాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన యెడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును. ఇతరులు వుంచిన దీపమును ఎగద్రోసి వృద్ధి చేసినయెడల కూడా, లేక ఆరిపొయిన దీపమును వెలిగించినను అట్టివారి సమస్త పాపములు హరించును. దానికి ఒక కథ కలదు.
సరస్వతి నదీ తీరంలో శిథిలమైన దేవాలయమొకటి కలదు. కర్మ నిష్ఠుడనే దయార్ద్రహృదయుడగు ఒక యోగిపుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీకమాసమంతా అక్కడే గడిపి పురాణపఠనము చేయలనే తలంపురాగా ఆ పాడుబడిన దేవాలయన్ని శుభ్రంగా వూడ్చి, నీళ్లతో కడిగి, బొట్లుపెట్టి, ప్రక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి, దూదితో వత్తుకు చేసి, పన్నెండు దినములుంచి, స్వామిని పూజిస్తూ, నిష్ఠతో పురాణము చదువుతుండెను. ఈ విధంగా కార్తీక మాసం ప్రారంభమునుండీ చేస్తుండెను. ఒకరోజు ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి, నలుగు మూలలు వెతికి, తినడనికి ఏమి దొరకనందున అక్కడ ఆరిపోయివున్న వత్తిని తినవలసినదేనని అనుకొని నోట కరచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను. నోటకరచివున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపొయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీకమాసం అవ్వటం వలన, దేవాలయంలో ఆరిపోయివున్న వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందువలన వెంటనే దానిరూపము మారి మానవరూపంలో నిలబడెను.
ధ్యాననిష్ఠలో వున్న యోగిపుంగవుడు తన కన్నులను తెరచిచూడగా, ప్రక్కనొక మానవుడు నిలబడి వుండటము గమనించి ” ఓయీ! నీవెవ్వడవు? ఎందుకిలా నిలబడి యుంటివి? అని ప్రశ్నించగా ” ఆర్యా! నేను మూషికమును, రాత్రి నేను ఆహారమును వెతుకుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమి దొరకనందున నెయ్యివాసనలతో వుండి ఆరిపోయిన వత్తిని తినాలని దానిని నోటకరచుకోని ప్రక్కనున్న దీపము వద్ద నిలబడగా నా అదృష్టంకొద్ది ఆ వత్తి వెలగటం వలన నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మమును ఎత్తితిని. కాని ఓ మహానుభావ! నేనెందుకీ మూషికజన్మ ఎత్తవలసి వచ్చిందో దానికున్నకారణం విశదీకరించండి” అని కోరెను. దానికి యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టిచే సర్వస్వమును తెలుసుకొని ” ఓయీ! క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవిన్, నిన్ను బాహ్లీకుడని పిలిచెవారు.నీవు జైన మతనికి చెందిన వాడివి. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ , ధనాశాపరుడవై దేవపూజలు, నిత్యకర్మలు మరిచి, నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తింటూ, మంచివారిని, యోగ్యులను నింధిస్తూ, స్వార్ధచింతన కలవాడివై ఆడపిల్లలను అమ్మేవృతి చేస్తూ, దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడపెడుతూ, సమస్త తినుభండాలను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరలకు అమ్ముతూ అలా సంపాదించిన ధనాన్నినీవు ఆనుభవించక, ఇతరులకు పెట్టక ఆ ధనమును భూస్థాపితము చేసి పిసినారివై జీవించావు. మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపములు అనుభవిస్తున్నావు. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి. దానివలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కావున నీవు నీ గ్రమానికిపోయి నీ పెరటియందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి, ఆ ధనముతో ధానధర్మలుచేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందు” అని అతనికి నీతులు చెప్పి పంపించెను.
పదిహేనవరోజు పారాయణము సమాప్తము
కార్తీకమాస పదిహేనవరోజు ఆచరించవలసిన దానధర్మలు – జపతపాది విధులు – ఫలితములు
పూజించాల్సిన దైవము → చంద్రుడు
జపించాల్సిన మంత్రము → ఓం సోమాయ సోమతనవే స్వాహా
నిషిద్ధములు → పగటిపూట భోజనం, ఉసిరి
దానములు → వరి అన్నపు భోజనం, వెండి
ఫలితము → మనశ్శాంతి, ప్రసాద గుణం