భర్తను చంపి, పాతినచోటే వంట
మధ్యప్రదేశ్: ఒక మహిళ తన భర్తను చంపి, వంటగది గట్టు కింద పాతి పెట్టడమే కాకుండా నెలరోజులుగా అక్కడే వంట చేసుకుని తింటున్న భయంకర సంఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. రాష్ట్రంలోని అనుప్పూర్ జిల్లా, కరోండి గ్రామంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది.మహిళను మధ్యప్రదేశ్ పోలీసులు నాటకీయ ఫక్కీలో అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన మహేష్ బన్వాల్ (35) అనే న్యాయవాది, అక్టోబరు 22 నుంచి కనపడకుండా పోయాడు. అతని భార్య ప్రమీల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఈ విషయంలో తనకు అనుమానాలు ఉన్నాయని ఆయన అన్న అర్జున్ బన్వాల్ పోలీసులను సంప్రదించటంతో కథ మలుపు తిరిగింది.ఈ నేపథ్యంలో ప్రమీల ఇంటిని తనిఖీచేస్తున్నసమయంలో, వంటగదిలోంచి దుర్వాసన రావడంతో అనుమానంతో అక్కడ తవ్విచూడగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహేశ్ శవాన్నిగుర్తించి వెలికి తీశామన్నారు. అనంతంర ప్రమీలను తమదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకుందని తెలిపారు. మహేశ్ పెద్దన్న గంగారం బన్వాల్ ఈ హత్య చేయడానికి తనకు సహాయం చేశాడని నిందితురాలు పేర్కొందన్నారు. గంగారం భార్యతో మహేశ్ కు అక్రమ సంబంధం ఉన్నదని ఈ నేపథ్యంలో మహేశ్ హత్యకు తనతో కలిసి పథకం రచించాడని ప్రమీల చెప్పిందన్నారు. ప్రమీలను అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.