అంత్యక్రియల కోసం ఎన్నడో దాచుకున్న డబ్బు… ఇప్పుడు పనికిరాదని తెలిసి హతాశులైన అక్కా చెల్లెళ్లు..!
తాము మరణిస్తే, తమ అంత్యక్రియల ఖర్చు సంతానానికి భారం కాకూడదని భావించిన అక్కా చెల్లెళ్లు, ఎంతో పొదుపు చేసి, రహస్యంగా డబ్బును దాచుకున్నారు. ప్రస్తుతం అవసాన దశలో వాటిని వాడుకోవాలని భావించి, అవి రద్దయిన పాత నోట్లని, ఇప్పుడు ఎందుకూ పనికిరావని తెలుసుకుని హతాశులయ్యారు.
ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పూరు జిల్లాలో జరిగింది. ఇక్కడి పూమలూరు గ్రామంలో రంగమ్మాళ్ (75), తంగమ్మాళ్ (72) అనే అక్కా చెల్లెళ్లు ఉన్నారు. వీరికి 13 మంది సంతానం కాగా, అందరూ వేర్వేరు చోట్ల స్థిరపడ్డారు. ఇద్దరి భర్తలు చనిపోవడంతో, పశువులను మేపుతూ, ఒకరికి ఒకరు సాయపడుతూ, ఒంటరి జీవనం సాగిస్తున్నారు.
తమ సంపాదనలో రహస్యంగా కొంత మొత్తాన్ని పొదుపు చేస్తూ, దాన్ని గోడలో దాచి పెడుతూ వచ్చారు. ఇటీవల తంగమ్మాళ్ కు తీవ్ర అనారోగ్యం కలుగగా, వైద్య చికిత్సలకు అవసరమైన డబ్బు గోడలో ఉందని, దాన్ని తీసుకు రావాలని ఓ కొడుక్కు చెప్పింది. అతను వెళ్లి చూస్తే, గోడలో రూ. 24 వేలు ఉన్నాయిగానీ, అవన్నీ రద్దయిన రూ. 500, రూ. 1000 నోట్లు. ఇవి ఇప్పుడు చెల్లవని అతను చెప్పడంతో, అక్క సైతం రూ. 22 వేలు ఇలాగే దాచి పెట్టిందని చెబుతూ కన్నీరుమున్నీరైంది.
పెద్దగా చదువుకోని వీరిద్దరికీ, పెద్ద నోట్ల రద్దు విషయం గురించి తెలియదని రంగమ్మాళ్ కుమారుడు సెల్వరాజ్ వెల్లడించాడు. తాము పొదుపు చేసిన డబ్బు పనికిరాదని తెలిసి వారు ఎంతో బాధపడుతున్నారని వాపోయాడు. వృద్ధుల అవసరాలు, సమస్యలు తీర్చేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ ను ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేయగా, వీరిద్దరి సమస్యనూ ప్రభుత్వం పరిష్కరించాలని వీరి విషయం తెలుసుకున్న ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.