కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజమన్నార్‌ అలంకారంలో సిరుల తల్లి


తిరుపతి, 2019 నవంబరు 26: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజు మంగ‌ళ‌వారం ఉదయం అమ్మవారు శ్రీ రాజగోపాలస్వామివారి అలంకారంలో చ‌ర్నాకోలు, దండం ద‌రించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు.

అశ్వాలు, వృషభాలు, గజాలు ఠీవీగా ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఉదయం 8.00 నుండి 10.00 గంటల వరకు వాహనసేవ కోలాహలంగా సాగింది. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

పాలకడలిని అమృతం కోసం మథించినవేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం. ఆకలిదప్పుల్ని తొలగించి, పూర్వజన్మస్మరణను ప్రసాదించే ఈ ఉదారదేవతావృక్షం అన్ని కోరికలనూ తీరుస్తుంది. ఖడ్గాన్ని, యోగదండాన్ని ధరించే గోపకిశోరుడిలా గోసంపదను పరిరక్షించే మంగళదేవత అలమేలుమంగ. మంగమ్మ పాదాలు కల్పతరువు చిగురును తలపిస్తున్నాయని అన్నమయ్య కీర్తించాడు. కోర్కెలను ఈడేర్చే కల్పవృక్షంపై విహరిస్తున్న అలమేలుమంగ ఆశ్రితభక్తులకు లేముల్ని తొలగించే పరిపూర్ణశక్తి.

మధ్యాహ్నం 12.30 గంటల నుండి 2.30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు. కాగా సాయంత్రం 6.00 గంటల నుండి 6.30 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది.

అలాగే రాత్రి 8.00 నుండి 10.00 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు హనుమంత వాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు. హనుమంతుడు శ్రీరామచంద్రునికి అనన్యభక్తుడు. త్రేతాయుగంలో శ్రీవారు శ్రీరాముడిగా అవతరించారు. ఆదిలక్ష్మి అలమేలుమంగమ్మ సీతగా మిథిలానగరంలో అవతరించి, స్వామిని వివాహమాడింది. ఆ సీతామాత కలియుగంలో పద్మావతిగా అవతరించింది. తన జాడను శ్రీవారికి తెలిపిన మహాభక్తుడైన ఆంజనేయుని కోరికను తీర్చడానికా అన్నట్టు అలమేలుమంగ బ్రహ్మోత్సవాలలో హనుమంతున్ని వాహనంగా చేసుకుంది.

వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌, ఆదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఆలయడెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, ఏవిఎస్వో శ్రీ నందీశ్వ‌ర్ ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About The Author