మెరిసిపోనున్న హైదరాబాద్‌ రోడ్లు ప్రైవేటు పరం కానున్న రోడ్లు.

హైదరాబాద్‌ రోడ్లంటే ఎవ్వరైనా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. విశ్వనగరంగా అభివృద్ది చెందుతున్న క్రమంలో వర్షాకాలం వచ్చిదంటే హైదరాబాద్‌ రోడ్లపై ప్రయాణించాలంటే నడుములు విరిగిపోతున్న పరిస్థితి. రోడ్లపై ఉండే గుంతల్లో పడి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు కూడా లేకపోలేదు. కొంతమందికి కాళ్లు చేతులు విరిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో రోడ్ల నిర్మాణాలు ప్రైవేటు సంస్థల చేతికి వెళ్లటంతో చక్కటి రోడ్లు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌ రోడ్ల నిర్మాణాలను ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించనుంది. వాటి నిర్వహణకూడా ప్రైవేటు సంస్థలే చూసుకుంటాయి. దీంతో ఇకపై నగరంలోని రోడ్లన్నీ ఇకపై మిలమిలా మెరిసిపోనున్నాయన్నమాట. రోడ్లపై గుంత అనేది కనిపించవన్నమాట. హైదరాబాద్‌ లోని 709 కిలో మీటర్ల మెయిన్‌ రోడ్లను ప్రైవేటు సంస్థలు నిర్మించనున్నాయి. దీని కోసం ప్రభుత్వం రూ.1800 కోట్లను కేటాయించనుంది. దీంట్లో భాగంగా జోన్ల వారీగా టెండర్ల ప్రక్రియ కూడా పూర్తైంది. ఈ కాంట్రాక్టుని ప్రభుత్వం బడా సంస్థలకు అప్పగించింది. దీనికి సంబంధించి ఇప్పటికే నాలుగు ప్యాకేజీలకు జీవోలు జారీ అయ్యాయి. మరో మూడు ప్యాకేజీలు ఆర్థిక శాఖ అనుమతి రాగానే జీవోలు జారీ కానున్నాయి. అనంతరం కాంట్రాక్ట్‌ అగ్రిమెంట్‌ అమలులోకి రానుంది. అనంతరం టెండర్లు దక్కించుకున్న సంస్థలు పనుల్ని ప్రారంభించనున్నాయి. నగరంలోని రోడ్లను ఎప్పటికప్పుడు కొత్తగా నిర్మించినా..మరమ్మతు పనులు చేపట్టినా అదే పరిస్థితి. గుంతల రోడ్లతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రోడ్ల నిర్మాణం..వాటి నిర్వహణ అంతా ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తోంది. 709 కిలోమీటర్ల ప్రధాన రహదారుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించనుంది. ఐదేళ్లలో నిర్మాణం, నిర్వహణకుగానూ రూ.1800 కోట్లు ఖర్చు చేయనున్నారు. రోడ్ల నిర్మాణం, గుంతల పూడ్చివేత, మరమ్మతు వంటి పనులు కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలే చూసుకుంటాయి. కాగా.. నగరంలోని పలు కాలనీలు, బస్తీల్లోని రోడ్ల నిర్వహణ ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నప్పటికీ మున్ముందు ఇదీ ప్రైవేటుపరం అయ్యే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.

త్వరలో రోడ్డు ప్రైవేటీకరణ పనులు ప్రారంభం : జీహెచ్‌ఎంసీ

నగరంలో రోడ్డు ప్రైవేటీకరణ పనులు త్వరలో ప్రారంభం కానునట్లు జీహెజ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ తెలిపారు. ఈ నెల 10నుంచి 709 కి. మీ మేరకు పనులు మొదలు పెడతామన్నారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను జనవరిలో ప్రారంభిస్తామన్నారు. ఫిబ్రవరి వరకు లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను అందించే విధంగా పనులు చేపడుతున్నట్లు, దాదాపు తొమ్మిది వేల వరకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పనులు పూర్తి అయ్యాయని తెలిపారు.ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ సమస్యలను తగ్గించేందుకు ప్రత్యామన్నాయ రోడ్ల కోసం భూసేకరణ చేస్తున్నామన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు నేరుగా ఫోన్‌ లేదా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమాచారం ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇక ఓపెన్‌ స్పేస్‌లలో పార్క్‌లను అభివృద్ధి చేస్తామని, మీడియన్‌.. జంక్షన్‌లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రతి జోన్‌లో స్కైవాక్‌ నిర్మించాలన్నారు. రోడ్డు మరమత్తు పనులు పూర్తి అవుతున్నాయని, చెత్త సేకరణ కోసం 60 ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్ల వెల్లడించారు. సీ అండ్‌ డీ వేస్ట్‌ పరిశ్రయ త్వరలోనే మొదలు కానుందని, వీటిని కంపోస్ట్‌ అలాగే కరెంట్‌ ఉత్పాదన కోసం ఉపయోగిస్తామన్నారు. మూడు నెలల్లో 284 పనులకు అనుమతులిచ్చామని, వీడీసీసీ రోడ్డు పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.

 

                                       

About The Author