ఉల్లి పంటతో కోటీశ్వరుడైన రైతు..!


గత నెల రోజులుగా ఊహించని ధరలతో ఉల్లి సామాన్య మానవుడిని ఇబ్బందులకు గురిచేస్తోంది. మరోవైపు అదే ఉల్లి బెంగళూరులో తనను నమ్ముకున్న ఓ రైతును మాత్రం కోటీశ్వరుడిని చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సరైన సమయానికి మంచి దిగుబడి తీయడంతో ఓ రైతు కోటీశ్వరుడైన ఘటన కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లాలో చోటుచేసుకుంది.

మల్లికార్జున అనే రైతుకు చిత్రదుర్గ జిల్లా దొడ్డసిడ్డవ్వనహల్లి ప్రాంతంలో పది ఎకరాల సొంత వ్యవసాయ భూమి ఉంది. ఈ పది ఎకరాల్లో ప్రతియేటా ఉల్లిపాయలు సాగుచేస్తుంటారు. ఈ ఏడాది కూడా భారీగా రూ.15లక్షల వరకూ రుణం తీసుకుని ఉల్లి పంట ప్రారంభించారు. ఆ సమయంలో డిమాండు ప్రకారం.. రూ.5 నుంచి 10లక్షలు రాబడిని అంచనా వేశారు. కానీ ఊహించని రీతిలో దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటి.. వాటికి భారీగా డిమాండు పెరగడం ఆయనకు అదృష్టం కలసి వచ్చి భారీగా ఆదాయం సాధించారు.
ఈ ఘటనతో ఆయన జిల్లాలో వ్యవసాయ వర్గాల్లో ప్రముఖుడిగా పేరు సంపాదించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను రుణం తీసుకుని పంట ప్రారంభించా. 240 టన్నులు దిగుబడి వచ్చింది. ఒకవేళ ఇప్పుడు ఉల్లికి డిమాండు లేకపోతే నేను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వాడిని. ఊహించని రీతిలో ఉల్లి దాదాపు రూ.200 వరకూ పలకడంతో భారీగా ఆదాయం వచ్చింది. నవంబర్‌ ప్రారంభంలో క్వింటాల్‌ ఉల్లి రూ.7వేల ధర పలకగా.. తాజాగా కొద్ది రోజుల్లో క్వింటాల్‌ రూ.12వేలకు అమ్ముడుపోయింది. దిగుబడి వచ్చే వరకు మా కుటుంబమే పంటకు రక్షణగా కాపలా ఉన్నాం. ఇప్పుడు నేను వచ్చిన ఆదాయంతో రుణం తీర్చి ఇల్లు కట్టుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా. లేదా ఇంకా వ్యవసాయభూమిని కొనాలనుకుంటున్నా. ’ అని అన్నారు.

About The Author