నగరంలో 55 స్లిప్ రోడ్ల నిర్మాణం…
నగరంలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రధాన రోడ్లపైన వాహనాల భారం తగ్గించేలా జిహెచ్ఎంసి సాధ్యమైనన్ని ఎక్కువ స్లిప్ రోడ్లను నిర్మించాలని పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు ఆదేశించారు. ఈ రోజు ప్రగతి భవన్లో జరిగిన సమీక్ష సమావేశంలో జిహెచ్ఎంసి అధికారులకు ఈ మేరకు పలు సూచనలు చేశారు. జిహెచ్ఎంసి పరిధిలో ఇప్పటికే మొదటి దశలో భాగంగా 55 స్లిప్ రోడ్లను గుర్తించామని, వీటి నిర్మాణానికి వేగంగా ప్రణాళికలు కొనసాగుతున్నాయని అధికారులు మంత్రి కేటీఆర్ కు తెలిపారు. ఈ 55 స్లిప్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ మరియు ప్లాన్లను, డిజైన్లను సిద్ధం చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికే 40 రోడ్లకు రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (ఆర్. డి. పి) సిద్ధమైందని తెలిపారు. ఇందులో 20 రోడ్లలో కేవలం 90 ఆస్తుల సేకరణ పూర్తి చేస్తే స్లిప్ రోడ్ల నిర్మాణ మొదటి దశ ప్రారంభం చేసేందుకు వీలు అవుతుందని తెలిపారు. నగరం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, నగర రోడ్లపై వాహనాల రద్దీ రోజురోజుకు పెరుగుతోందని, దీన్ని ఎదుర్కొని పౌరులు సులభంగా తమ గమ్యం చేరేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (ఏస్సార్డీపి), కాంప్రహెన్సివ్ రోడ్డు మెయిన్ టనెన్స్ ప్రొగ్రామ్ (సి ఆర్ యంపి) వంటి కార్యక్రమాల ద్వారా మౌలిక వసతుల కల్పన పెద్ద ఎత్తున చేపడుతున్నామని అన్నారు. దీంతోపాటు అభివృద్ధి ద్వారా కూడళ్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. రోడ్ల వెంబడి పాదచారులు నడిచేందుకు వీలుగా పెద్ద ఎత్తున ఫుట్పాత్ల నిర్మాణం కూడా చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటికే ప్రతి జోన్లో కనీసం పది కిలోమీటర్ల చొప్పున జనసమ్మర్ధం ఉండే రోడ్ల వెంబడి పుట్ పాత్ల నిర్మాణం చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జిహెచ్ఎంసి బస్ బేల నిర్మాణం కోసం పలు ప్రాంతాలను గుర్తించి ఉందని, ఈ ప్రాంతాల్లో బస్సు బేల నిర్మాణం మరింత వేగంగా పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ ఈ సమీక్ష సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతున్న రోడ్ల వివరాలను ఈ సమీక్ష సమావేశంలో అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న హైటెన్షన్ వైర్ల కింద (పవర్ కారిడార్లలో) రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి ఒక నివేదిక సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను కోరారు. హెచ్ యండిఏ చేపడుతున్న రోడ్ల నిర్మాణంతో, జిహెచ్ఎంసి చేపడుతున్న రోడ్ల నిర్మాణ ప్రణాళికలను సమన్వయం చేసుకోవాలని తెలిపారు.
ఈ సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ మరియు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ మరియు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.