తమిళ స్మగ్లర్లు కు సహాయం చేసిన స్థానికుడు అరెస్టు,పారిపోయిన తమిళ స్మగ్లర్లు
తిరుపతి:తిరుపతి కి చెందిన వ్యక్తి సహాయంతో 29 ఎర్ర చందనం దుంగలను రవాణా చేయడానికి సిద్దంగా ఉన్న వాహనాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 35 మంది తమిళ స్మగ్లర్లు ఎర్ర చందనం దుంగలను మోసుకుని రాగా ఆర్ ఎస్ ఐ వాసు టీమ్ వారిని చుట్టు ముట్టారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జి శ్రీ పి రవిశంకర్ గారి ఆదేశాల మేరకు ఆర్ ఎస్ ఐ వాసు, పివి నరసింహారావు టీమ్ శనివారం రాత్రి నుంచి కల్యాణి డ్యామ్ నుంచి బాకరాపేట ఘాట్ వైపు కూంబింగ్ చేపట్టారు. ఆదివారం ఉదయం ఆవుల దొడ్డి ప్రాంతంలో ఒక కారు అనుమానాస్పదంగా కనిపించింది. అదే సమయానికి దాదాపు 35 మంది స్మగ్లర్లు దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు. వాహనం వద్ద తిరుపతి గిరిపురం కాలనీకి చెందిన సయ్యద్ జమీల్ (21) కాపలా ఉన్నాడు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది ని చూసిన తమిళ స్మగ్లర్లు దుంగలను పడేసి పారిపోయారు. దట్టమైన పొదలు చిమ్మ చీకటి వాళ్లు పారిపోవడానికి అనుకూలమయ్యింది. సయ్యద్ జమీల్ ను అరెస్టు చేసి, చెల్లా చెదురుగా ఉన్న 29 దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
సంఘటన స్థలానికి సిఐ సుబ్రమణ్యం, పీసీ నాగేంద్ర చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై టాస్క్ ఫోర్స్ ఇంచార్జి శ్రీ రవిశంకర్ గారు మాట్లాడుతూ గతంలో కూడా ఇదే ప్రాంతంలో పది మంది స్మగ్లర్లు ను పట్టుకున్నామని అన్నారు. ఈ ప్రాంతం లో నిఘా పెంచుతున్నట్లు తెలిపారు. ఈ అపరేషన్ లో పాల్గొన్న ఆర్ ఎస్ ఐ వాసు టీమ్ లోని సిబ్బంది జయచంద్ర, శ్రీనివాసులు, జ్యోతీస్, వెంకటేష్, గోవర్ధన్, ప్రసాద్, లక్ష్మీనారాయణ లను ఆయన అభినందించారు. భాకరాపేట లోని అటవీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహకరించారు.