ఇరాన్ మసీదుపై ఎర్రజెండా..
ఆధునిక చరిత్రలో తొలిసారిగా ఇరాన్‌లోని జంకారా మసీద్ డోమ్‌పై ఎర్ర జెండాను ఎగరేశారు. సాధారణంగా ఎర్ర జెండాను విప్లవానికి, చైతన్యానికి స్ఫూర్తిగా భావిస్తారు. కానీ మసీదు పైభాగంలో ఎర్ర జెండా ఎగరేయడం.. యుద్ధం రాబోతున్నది అనడానికి సూచికగా భావిస్తారు. బగ్దాద్‌లో ఇరాన్ నిఘా విభాగం ఖడ్స్ ఫోర్స్ మేజర్ జనరల్ ఖాసీం సులైమనీని ఇటీవలే అమెరికా హతమార్చిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఇరాన్ మసీదుపై ఎర్రజెండా ఎగరేసింది.
(పగ తీర్చుకున్నాకే.. జెండా అవనతం)
షియా ముస్లింల ఆచారం ప్రకారం.. అన్యాయంగా రక్తం చిందిందనడానికి, ప్రతీకారం తీర్చుకోవాలనడానికి ఎర్ర జెండాలను సూచికలుగా భావిస్తారు. క్రీ.శ. 680లో కర్బాలా యుద్ధం తర్వాత ఎర్ర జెండా ఎగరేశారు. ఆ యుద్ధంలో మహ్మద్ ప్రవక్త మనవడైన ఇమామ్ హుస్సేన్ హతమయ్యాడు. షియా సంప్రదాయం ప్రకారం పగ తీర్చుకున్నాకే ఆ జెండాను కిందకు దించుతారు. దీంతో ఇప్పటికీ ఆ జెండాను అవనతం చేయలేదు.
సులైమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని..
సులైమానీని హతమార్చినందుకు గానూ ప్రతీకారం తీర్చుకోవాలని వేలాది మంది ప్రజలు ఇరాన్ వీధుల్లోకి వచ్చి నినాదాలు చేశారు. సులైమానీ అంతిమ యాత్రలో.. అమెరికాను అతిపెద్ద సైతాన్గా అభివర్ణిస్తూ.. ఇరాక్ రాజధాని బగ్దాద్‌లో జనం నినాదాలు చేశారు.