బాధ్యతలు స్వీకరించిన దీపిక పాటిల్‌…


విజయవాడ : రాష్ట్రంలో దిశ చట్టం అమలు కోసం ప్రత్యేక అధికారిణిగా నియమితురాలైన దీపిక పాటిల్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్టవేస్తామని చెప్పారు. మహిళల సంరక్షణకు పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తామని తెలిపారు. త్వరిత గతిన దర్యాప్తును పూర్తి చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేసి దిశ చట్టాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు.

కాగా, రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన ఏపీ దిశ చట్టం -2019 అమలు కోసం కృతికా శుక్లా, దీపికాలను ప్రభుత్వం స్పెషల్‌ ఆఫీసర్లుగా నియమించిన సంగతి తెలిసిందే. ఇందులో దీపిక 2014లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. శిక్షణ పూర్తయిన తర్వాత కొంత కాలం గ్రేహౌండ్స్, మరికొంతకాలం పార్వతీపురం ఏఎస్పీగా పనిచేశారు. తిరుపతి ఏసీబీ విభాగంలో ఏఎస్పీగా పనిచేసిన తర్వాత ఐదు నెలల పాటు సెలవులో వెళ్లారు. ఆ తర్వాత కర్నూలుకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఐపీఎస్‌ విభాగంలో కర్నూలు ఏఎస్‌పీగా ఉన్న దీపికను గుంటూరు సీఐడీ విభాగంలో ఏడీజీగా బదిలీ చేసి దిశ స్పెషల్‌ ఆఫీసర్‌గా నియమించారు.

About The Author