చైనాను వణికిస్తోన్న సరికొత్త వైరస్.. కరోనా బారిన పడ్డ భారతీయ మహిళ..

బీజింగ్: చైనాను ప్రస్తుతం కరోనా జాతికి చెందిన సరికొత్త వైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ భారతీయురాలు ఈ వైరస్ బారిన పడ్డారు. చైనాలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రీతి మహేశ్వరి (45) తీవ్ర అస్వస్థతతో శుక్రవారం రోజు ఆసుపత్రిలో చేరారు. ఆమెకు వైద్యపరీక్షలు చేసిన డాక్టర్లు.. ప్రీతి మహేశ్వరికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు. వెంటీలేటర్ సహాయంతో ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రీతి మహేశ్వరి ప్రస్తుతం స్పృహలో లేదని.. ఆమె కోలుకోవడానికి సమయం పడుతుందని డాక్టర్లు వెల్లడించారు. కాగా.. చైనాలో విశ్వవిద్యాలయాల నగరంగా పేరొందిన ‘వూహాన్’, షెన్‌జెన్ ప్రాంతాల్లో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది.

ఇప్పటికే 62 మంది ఈ వైరస్ బారిన పడగా.. న్యూమోనియా తరహా లక్షణాలో బాధపడుతూ ఇద్దరు మరణించారు. మరో 19 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వగా.. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు. దాదాపు 500 మందికి పైగా భారతీయులు అక్కడి యూనివర్సీటీల్లో చదువుకుంటున్నారు. వైరస్ ముప్పు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం ఇప్పటికే వారికి సూచించింది. 2003లో విజృంభించిన సార్స్ తరహాలో ఇది ప్రాణాంతకం అవుతుందేమో అని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

 

About The Author