అమ్మ చనిపోయినా..ఆమె జ్ఞాపకాలు గుర్తుండాలని!
అల్లారు ముద్దుగా పెరుగుతున్న ఆతడి జీవితంలోకి అనుకోని ఉపద్రవం వచ్చిపడింది. తన మూడో సంవత్సరంలోనే తండ్రిని మృత్యువు కబళించింది. తాజాగా అతని తల్లి కూడా రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయ్యారు. కుటుంబ సభ్యులంతా వద్దని వారిస్తున్నా 10 ఏళ్ల మయాంక్ అనే ఆ బాలుడు మాత్రం అమ్మ జ్ఞాపకాలు పదిలంగా ఉండాలనే ఉద్దేశంతో ఆమె అవయవాలను దానం చేసేందుకు అంగీకరించాడు. అంత చిన్నతనంలో అతడి ఆలోచనా విధానాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన మయాంక్ స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. రెండ్రోజుల క్రితం ఆయన తల్లి రోడ్డు ప్రమాదానికి గురైంది. పరీక్షించిన వైద్యులు బ్రెయిన్‌డెడ్ అయ్యిందని నిర్ధరించారు. తెలిసీ తెలియని వయస్సులోనే తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారికి ఈ ఘటన మింగుడుపడలేదు. తల్లి జ్ఞాపకాలను పదిలం చేసుకోవాలనుకున్నాడు. వైద్యుల సూచన మేరకు ఇతరుల్లోనైనా అమ్మను చూసుకోవాలనే ఉద్దేశంతో అవయవదానానికి అంగీకరించాడు.
తొలుత కుటుంబ సభ్యులు వద్దని వారించినా, ఆపదలో ఉన్న ఇతరులకు సాయం చేయాలన్న అతడి మనస్తత్వానికి మంత్రముగ్దులైపోయారు. మృతదేహాన్ని దహనం చేస్తామనుకున్న బంధువులంతా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అంత చిన్న వయస్సులోనూ గొప్పగా ఆలోచించిన అతడికి సామాజిక మాధ్యమాల్లోనూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.