ఈ పెళ్లి చేసింది మహిళా పూజారి..


సాధారణంగా వివాహ వేడుకల్ని మగ పూజారులు నిర్వహించడం మనం చూసుంటాం. కానీ తమిళనాడు చెన్నైలో అందుకు విభిన్నంగా ఓ వివాహ వేడుక జరిగింది. ఓ మహిళా పూజారి హిందూ ఆచారాలు, సంప్రదాయం ప్రకారం జంట వివాహం జరిపించి అందరినీ ఆకర్షించారు. గత శుక్రవారం జరిగిన ఈ వేడుకకు చెన్నై వేదికైంది. తెలుగు రాష్ట్రానికి చెందిన సుష్మ అనే యువతి న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు తమిళనాడుకు చెందిన విఘ్నేష్‌ రాఘవన్‌తో 7వ తేదీన వివాహం నిశ్చయమైంది.
ఈ క్రమంలో వధువు తన పెళ్లి మహిళా పూజారితో సమక్షంలో జరిపించుకోవాలనుకుంటున్నా అని తండ్రిని కోరింది. దీంతో ఆమె తండ్రి సురేష్‌ రెడ్డి ఎంతో కష్టపడి మైసూరుకు చెందిన భ్రమరాంబ మహేశ్వరి అనే వేద పండితురాలిని గుర్తించి పెళ్లికి ఆమెను ఆహ్వానించారు. అందుకు అంగీకరించిన భ్రమరాంబ అనుకున్న ముహూర్తానికి చెన్నై విచ్చేసి రెండు కుటుంబాల సంప్రదాయాల ప్రకారం.. వేదమంత్రోచ్ఛారణల మధ్య వారి వివాహాన్ని జరిపించారు. పెళ్లికి వచ్చిన ఇరువురి బంధువులు ఈ సంఘటనను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం పలువురు మరిన్ని వివాహాలకు ఆమెను సంప్రదించేందుకు నంబర్‌ కూడా తీసుకోవడం విశేషం.

About The Author