కరోనా భయంతో నాటుసారా మారణహోమం..


మహమ్మారి కరోనా కంటే వదంతులు ఎంతటి ప్రాణాంతకమైనవో తెలియజెప్పే విషాద ఉదంతమిది! వైరస్‌కు నాటుసారా విరుగుడుగా పనిచేస్తుందన్న ప్రచారాన్ని నమ్మి ఇరాన్‌లో 27 మంది ప్రాణాలను కోల్పోయారు. మరో 218 మంది ఆస్పత్రి పాలయ్యారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. చైనా తర్వాత కొవిడ్‌-19 తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇరాన్‌ ఒకటి. ఆ దేశంలో ఇప్పటివరకు 7 వేలమందికి పైగా వైరస్‌ బారినపడ్డారు. సోమవారం ఒక్కరోజే కరోనాతో 43 మంది మరణించారు. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో జనం తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కరోనా చికిత్సలో నాటుసారా ప్రభావవంతంగా పనిచేస్తుందన్న వదంతులు కొన్నాళ్లుగా అక్కడ ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. దీంతో తమకు కరోనా సోకిందని భావించిన పలువురు తాజాగా అధిక స్థాయిలో నాటుసారా తాగి అస్వస్థతకు గురయ్యారు. వారిలో 27 మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో 20 మంది ఖుజెస్థాన్‌ ప్రావిన్సుకు చెందినవారని, ఏడుగురు అల్బోర్జ్‌ ప్రాంతవాసులని అధికార వర్గాలు వెల్లడించాయి. నాటుసారాలో మెథనాల్‌ ఎక్కువగా ఉంటుంది. దాన్ని అధికంగా తీసుకుంటే వ్యక్తులు కంటి చూపు కోల్పోతారు. కాలేయం దెబ్బతింటుంది. ఒక్కోసారి మరణం కూడా సంభవిస్తుంటుంది. ఇరాన్‌లో మద్యపానంపై నిషేధం ఉంది. కొన్ని ముస్లిమేతర వర్గాలు మాత్రం ఈ నిషేధాజ్ఞలకు మినహాయింపు.

About The Author