మీరు రాష్ట్రానికి డీజీపీ అని మరిచిపోయారా? హైకోర్టు జడ్జి
మీరు రాష్ట్రానికి డీజీపీ అని మరిచిపోయారా?
గౌతమ్ సవాంగ్‌ని నిలదీసిన హైకోర్టు జడ్జి
న్యాయమూర్తి ప్రశ్నలకు డీజీపీ మౌనమే సమాధానం
పదవి కోసం తమని బలి చేస్తున్నాడని పోలీసు అధికారుల్లో మథనం.
డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై ఏపీ హైకోర్టు న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు మీరు రాష్ట్రానికి డీజీపీ అనే సంగతైనా గుర్తుందా అని నిలదీశారు.
విశాఖ ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం లో మాజీ తెనాలి శ్రావణ్‌కుమార్ వేసిన కేసులో హైకోర్టు డీజీపీని కోర్టుకి పిలిపించింది. గురువారం ఉదయం 10.15 నిమిషాలకు కోర్టుకి వచ్చిన డీజీపీ సవాంగ్‌ని సాయంత్రం 4.30కి కోర్టు పిలిచింది.
ఈ సందర్భంగా
CRPC 151 కింద నోటీసులు ఎలా ఇస్తారో వివరించాలని డీజీపీని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై డీజీపీ నీళ్లు నమలగా CRPC 151 సెక్షన్ ఆర్డర్ చదవాలని జడ్జి ఆదేశించారు. నిబంధనలు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసులపై ఎందుకు యాక్షన్ తీసుకోలేదని జడ్జి అడగగా, కోర్ట్ ఆదేశిస్తే చర్యలు తీసుకుంటామని డీజీపీ వివరించారు.
తప్పుచేసిన పోలీసులపై చర్యలు తీసుకునేందుకు కోర్టు ఆర్డర్ అవసరంలేదని, మీరు ముందు చర్యలు తీసుకోండి మా నిర్ణయం మేము వెల్లడిస్తామని కోర్టు పేర్కొంది.
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు ఎందుకు రూల్ ఆఫ్ లాని పాటించలేదని, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ స్థాయిలో CRPC 151 కింద నోటీసులు ఇచ్చారా అని నిలదీసింది. దీనిపై డీజీపీ మౌనమే సమాధానం ఇచ్చారు.
ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి పోలీస్, న్యాయ వ్యవస్థలు చట్టాన్ని న్యాయాన్ని మాత్రమే అమలుపరచాలన్న ధర్మాసనం పేర్కొంది. రూల్ ఆఫ్ లాని ఎందుకు అమలు చేయడంలేదంటూ ప్రశ్నించగా, డీజీపీ ఏదో చెప్పబోయారు.
జడ్జి కలుగజేసుకుని రాజధాని గ్రామాల్లో సెక్షన్ 144 పేరుతో వందలాది మంది పోలీస్ ల మోహరింపును ప్రస్తావించింది. రాజధానిలో కూడా మీరు ఏం చేస్తున్నారో మాకు తెలుసంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. మీరు ఈ రాష్ట్రానికి డీజీపీ అనే విషయమైనా మీకు గుర్తుందా అని నిలదీసింది. ఇకపై రూల్ ఆఫ్ లా తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. రూల్ ఆఫ్ లా పాటిస్తానని కోర్టుకు డీజీపీ తెలిపారు.
ఈ కేసు విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ తన వాదన వినిపించేందుకు ప్రయత్నించగా కోర్టు సున్నితంగా తిరస్కరించింది. కాగా డీజీపీ వ్యవహారశైలి, కొంతమంది పోలీసు అధికారులు జగన్ ప్రభుత్వం కోసం ఏమైనా చేయడానికి వెనుకాడకుండా దూకుడుగా తీసుకుంటున్న నిర్ణయాలతో తామంతా న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడాల్సి వస్తోందని కొందరు పోలీసు అధికారులు తమలో తామే మథనపడుతున్నారు.
మరోవైపు ఈ నెలలో డీజీపీ కోర్టుకు హాజరు కావడం ఇది రెండోసారి.