corona affect: తిరుమలలో థర్మల్ గన్ ద్వారా పరీక్షలు

తిరుపతి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలను చేపట్టింది అధికార యంత్రాంగం. తిరుమ‌ల‌లోని గోకులం విశ్రాంతి భ‌వ‌నంలోని స‌మావేశ మందిరంలో గురువారం సాయంత్రం అద‌న‌పు ఈవో అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

థర్మల్ గన్ ద్వారా పరీక్షలు.. వారు రావొద్దు

తిరుమలకు వచ్చే భక్తులను మార్చి 13 నుంచి థర్మల్ గన్ ద్వారా పరీక్షించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వెల్లడించింది. ఇందులో భాగంగా అలిపిరి తనిఖీ కేంద్రం, శ్రీవారి మెట్లు, అలిపిరి నడక మార్గాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు టీడీపీ ప్రకటించింది. కరోనా అవగాహన కేంద్రాల వద్ద కూడా థర్మల్ గన్స్ ద్వారా భక్తులను పరిశీలించనున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు తిరుమలకు రావద్దంటూ భక్తులకు విజ్ఞప్తి చేసింది. ఎన్నారైలు, విదేశీయులపై పలు ఆంక్షలను విధించింది. ఇండియాకు వచ్చిన 28 రోజుల తర్వాతే తిరుమలకు రావాలని స్పష్టం చేసింది.

టికెట్ల రద్దుకు అవకాశం..

వీడియోల ద్వారా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో భక్తులకు అవగాహన కల్పించనున్నట్లు టీటీడీ తెలిపింది. కరోనా భయంతో తిరుమలకు రాలేని భక్తులు టికెట్లను రద్దు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు టీటీడీ వెల్లడించింది. ప్రత్యేక దర్శనం, గదులు, ఆర్జిత సేవా టికెట్లు రద్దు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. టికెట్లు రద్దు చేసుకోవాలనుకునే భక్తులు dyeotemple@gmail.com ద్వారా సంప్రదించాలని టీటీడీ సూచించింది.

ఎల్ఈడీ స్క్రీన్లతో ప్రచారం..

శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్, రేడియో అండ్ బ్రాడ్ కాస్టింగ్ విభాగాల‌ ద్వారా తిరుమ‌ల‌లోని ముఖ్య కూడ‌ళ్ల‌లోనూ, ర‌ద్ధీ అధికంగా ఉండే ప్రాంతాల‌లో నిరంత‌రాయంగా ప్ర‌చారం చేయాల‌ని అధికారుల‌ను టిటిడి అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆదేశించారు. అదేవిధంగా భ‌క్తుల‌లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు చిన్న ప్రోమో త‌యారు చేసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, ఎల్ఇడి స్క్రీన్‌లు ఉన్న ప్రాంతాల‌లో ప్ర‌సారం చేయాల‌న్నారు.

కరోనా సోకకుండా ప్రత్యేక జాగ్రత్తలు..

తిరుమ‌ల‌లో క‌రోనా వైర‌స్ సోక‌కుండా విస్తృతంగా వైద్య, పారిశుద్ధ్య చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆరోగ్య విభాగం అధికారుల‌ను ఆదేశించారు. తిరుమ‌ల‌లో విధులు నిర్వ‌హించే టిటిడి ఉద్యోగులంద‌రికి మాస్కులు అందించాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. తిరుమ‌ల‌లోని అన్ని ప్రాంతాలు, వ‌స‌తి స‌మూదాయాలు, భ‌క్తుల ర‌ద్ధీ అధికంగా ఉన్న ప్రాంతాల‌లో శానిటైజర్లు, ప్ర‌తి రెండు గంట‌ల‌కు ఒక‌సారి అంటు రోగ నివార‌ణ మందుల‌తో ప‌రిస‌రాల‌ను శుభ్రం చేయాల‌న్నారు. జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం ఉన్న భ‌క్తులు తిరుమ‌ల‌లోని ప్ర‌థ‌మ‌చికిత్స‌కేంద్రాలు, అశ్వ‌ని ఆసుప‌త్రిలో సంప్ర‌దించాల‌న్నారు.

 

About The Author