వినకపోతే కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుంది: కేసీఆర్‌…


హైదరాబాద్‌: తెలంగాణలో ఇప్పటివరకు 36 కేసులు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. బాధితుల్లో ఎవరికీ సీరియస్‌గా లేదన్నారు. అందరూ కోలుకుంటున్నారని చెప్పారు. మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

‘‘బాధితులంతా ఏప్రిల్‌ ఏడో తేదీ వరకు డిశ్చార్జి అయిపోతారు. ఈ లోపు కొత్త కేసు రాకపోతే మనం జీరోకి వెళ్లే ఆస్కారం ఉంటుంది. అందువల్ల ముందు జాగ్రత్త చర్యలు మాత్రం గట్టిగా తీసుకోవాల్సి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి ఇంచుమించు 191 దేశాలకు పాకింది. సోకనటువంటి దేశమే లేదని వార్తలొస్తున్నాయి. 
రాష్ట్రంలో 114 మంది కరోనా అనుమానితులు ఉన్నారు. 82 మంది విదేశాల నుంచి వచ్చినవారు కాగా.. 32 మందికి సోకి ఉండవచ్చు అనే అనుమానం ఉంది. రేపటికల్లా ఫలితాలు వస్తాయి.
ఈ జబ్బు చాలా పెద్ద మహమ్మారి. యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇది పరిమిత సమస్య కాదు. అందరం అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు మంచి పద్ధతిలోనే చెప్పి ముందుకుపోయేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రజలు దానికి 100 శాతం సహకరించాలి. అమెరికాలాంటి దేశం స్థానిక పోలీసులు కంట్రోల్‌ చేయలేక ఆర్మీని దింపింది. మన దగ్గర కూడా ప్రజలు పోలీసులకు సహకరించకపోతే ఆటోమెటిక్‌గా 24గంటల కర్ఫ్యూ పెట్టాల్సి వస్తుంది. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుంది. అప్పటికీ కంట్రోల్‌ కాకపోతే ఆర్మీని మోహరించాల్సి వస్తుంది. ఈ పరిస్థితి తెచ్చుకుందామా ఆలోచించండి. మనకు మనమే పాటించాలి. ఒక వ్యక్తితో ఈ వైరస్‌ పది, 100 మందికి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చర్యలు ఆపదు.  మనమే జాగ్రత్తగా ఉండి ముందుకు పోతే మంచిదని విజ్ఞప్తి
చేస్తున్నా’’ అని కేసీఆర్‌
*అన్నారు.✍?*

About The Author