దండం పెడుతూ.. కరోనాపై మంత్రి హరీశ్ రావు వినూత్న ప్రచారం..
కరోనా మహమ్మారి నుంచి ప్రజలు తమను తాము రక్షించుకోవాలని, సమాజానికి వీలైనంత దూరంగా ఉండాలని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు కోరారు. అంతేకాదు.. సిద్దిపేటలో వినూత్న ప్రచారం కూడా చేపట్టారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలకు దిశానిర్దేశం చేశారు. పోలీస్ శాఖ ఆధ్వర్యలో ఓ వాహనాన్ని ఏర్పాటు చేసి.. దానిపై స్క్రీన్ ఏర్పాటు చేయించారు. ఆ వాహనం సిద్దిపేట నియోజకవర్గంలో తిరుగుతూ హరీశ్ వీడియోను ప్లే చేస్తోంది. వీడియోలో.. ‘కరోనా అనే వైరస్ మొత్తం ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్నది. కరోనా అనే రోగ క్రిమి వల్ల కోవిడ్-19 అనే జబ్బు వస్తుంది. 2019 డిసెంబర్లో చైనాలోని వుహాన్లో బయటపడ్డ ఈ వైరస్.. 150 దేశాలకు పాకింది. ఈ వైరస్ మన దేశంలోకి మన రాష్ట్రంలోకి కూడా ప్రవేశించింది. ఇది ఒకరి నుండి ఒకరికి సోకే భయంకరమైన అంటువ్యాధి. నిన్నటి దాకా రాష్ట్రంలోకి వచ్చిన విదేశీయుల్లోనే కనిపించిన ఈ వ్యాధి ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న వారికి కూడా సోకుతున్నది. ఇది ప్రాణాంతకమైన వైరస్. ఇది సోకకుండా ఉండేందుకు వ్యాక్సిన్ ఇంకా కనుక్కోలేదు. ఇప్పుడు మనల్ని మనం కాపాడుకోగాలిగేది కేవలం ముందు జాగ్రత్తల ద్వారా మాత్రమే’ అంటూ తెలిపారు హరీశ్. ‘చేతులు జోడించి అందర్నీ వేడుకుంటున్నా. దయచేసి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీరు తీసుకునే జాగ్రత్తల వల్ల మీరు మీ ప్రాణాన్ని కాపాడుకోవటమే కాకుండా వేలాది మంది ప్రాణాలు కాపాడిన వాళ్లవుతారు. మార్చి 31 వరకు అందరూ ఇళ్లల్లోనే ఉండండి. గుమిగూడితే ఈ జబ్బు వేగంగా వ్యాప్తి చెందుతుంది. అందుకని అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటికి రాకండి. ఎవరైనా విదేశాల నుండి వస్తే వెంటనే ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇవ్వండి. దూర ప్రయాణాలు చేయకండి. ఫంక్షన్లు వాయిదా వేసుకోండి’ అని సందేశం ఇచ్చారు. ప్రజలను కరోనా నుంచి రక్షించేందుకు ప్రభుత్వ వ్యవస్థ అప్రమత్తంగా సేవలందిస్తున్నదని, సీఎం కేసీఆర్ నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పారు. దయచేసి వీధుల్లోకి రావొద్దని, నాకేం అవుతుందిలే అనే మీ అజాగ్రత్త, మీ నిర్లక్ష్యం వల్ల మానవ వినాశనానికి మీరు కారణం అవుతారని అన్నారు. ఇటలీకి పట్టిన గతి మనకు పట్టకుండా ఉండాలంటే జాగ్రత్త పడాలని.. ప్రభుత్వ ఆజ్ఞలు మీరితే జరిమానా విధించడంతో పాటు, కేసులు కూడా బుక్ చేస్తామని ఆయన హెచ్చరించారు. పోలీసులకు సహకరిస్తూ, విజ్ఞతతో ప్రవర్తించాలని కోరారు.