ఈ నీచులు కొడుకులా ..? కిరాతకులా..?? కరోనా సాకుతో తల్లిని వీధిలో వదిలేశారు…


అనారోగ్యంతో ఉన్న ఓ వృద్ధురాలిని కరోనా పేరుతో వదిలించుకోవాలనుకున్నారు… ఆటోలో తీసుకొచ్చి రహదారి పక్కన వదిలేశారు.. ఈ ఘటన విజయనగరం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన ప్రభావతికి ఇద్దరు కుమారులు. వారికి పెళ్లిళ్లు అయిపోయాయి. కోడళ్లు, మనవలున్నారు. భర్త చనిపోయారు. ప్రస్తుతం చిన్న అనకాపల్లిలో కుమారుడి దగ్గర ఉంటున్నారు. ఆయన మొదట్లో తల్లిని బాగానే చూసుకున్నారు. ఇటీవల ఆమెను ఇంట్లో ఒంటరిగా వదిలేసి భార్యతో కలిసి విజయనగరంలోని అత్తారింటికి వచ్చాడు. అనకాపల్లిలో అద్దె ఇల్లు కావడంతో యజమాని ఖాళీ చేయాలని చెప్పారు. చేసేది లేక చిన్న కుమారుడు ఇతర కుటుంబ సభ్యులు అనకాపల్లి వెళ్లి ప్రభావతిని విజయనగరం తీసుకొచ్చారు. కొన్ని రోజుల పాటు ఆమెను ఎక్కడైనా ఉంచేందుకు ఓ ఉపాయం ఆలోచించారు. కరోనా అని చెబితే ఆసుపత్రిలో ఉంచేస్తారని భావించారు. ప్రభావతిని కేంద్రాసుపత్రికి తీసుకెళ్లి… కరోనా వచ్చిందని చెప్పారు. వైద్యులు పరీక్షలు చేసి ఆ లక్షణాలేవీ లేవని ఇంటికి తీసుకెళ్లండని చెప్పారు. ఆమెను ఇంటికి తీసుకుపోకుండా గంటస్తంభం సమీపంలో రాజీవ్‌ మైదానం రహదారి పక్కన వదిలేశారు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. ఎస్‌ఐ నారాయణరావు సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. కుటుంబసభ్యులకు ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. విజయనగరంలోనే ఉంటున్న ప్రభావతి సోదరి సుమతితో మాట్లాడారు. కొడుకులు, కోడళ్లను పిలిచి మాట్లాడతామని, వినకపోతే కేసులు నమోదు చేస్తామని, అప్పటిదాకా బాగోగులు చూడాలని చెప్పి, ఆమెను సుమతి ఇంటికి చేర్చారు.

About The Author