తమిళనాడులో తొలి కరోన మరణం…. మృతుడు ఇదివరకే షుగర్ వ్యాధిగ్రస్తుడు…


దేశంలో కరోనా మహమ్మారి బారిన పడి మరొకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 11కు చేరింది. అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన 54 ఏళ్ల వ్యక్తి కొన్ని రోజుల క్రితం జలుబు, దగ్గు, జ్వరంతో మధురైలోని రాజాజీ ఆస్పత్రిలో చేరాడు. వైద్య పరీక్షలు చేయగా.. కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స ప్రారంభించారు. కానీ, అప్పటికే ఆయన ‘అన్‌కంట్రోల్డ్‌ డయాబెటిస్‌’, సీఓపీడీ, హైపర్‌టెన్షన్‌ వంటి సమస్యలతో బాధపడుతుండడంతో రోగనిరోధక శక్తి పూర్తిగా క్షీణించింది. దీంతో ఆరోగ్యం మరింత క్షీణించి బుధవారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్‌ ధ్రువీకరించారు. తమిళనాడులో కరోనా వల్ల సంభవించిన తొలి మరణం ఇదే కావడం గమనార్హం. మంగళవారం మరో ఆరుగురిలో వైరస్‌ ఉన్నట్లు గుర్తించడంతో తమిళనాడులో బాధితుల సంఖ్య 18కి చేరింది. దేశంలో ఇప్పటి వరకు 519 మంది మహమ్మారి బారిన పడ్డట్లు గుర్తించారు.

About The Author