కరోనాపై పోరులో భారత్ గెలుస్తుంది: చైనా
దిల్లీ: దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో భారత్ తప్పక విజయం సాధిస్తుందని చైనా ఆశాభావం వ్యక్తం చేసింది. ఇలాంటి అత్యవసర సమయంలో భారత్‌కు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. చైనాలో కరోనా వైరస్ విజృంభించిన సమయంలో భారత్ చేసిన సాయానికి చైనా మరోసారి కృతజ్ఞతలు తెలిపింది. కరోనాపై చైనా చేసిన పోరాటానికి వివిధ రూపాల్లో మద్దతు తెలిపిన భారత ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసింది. దేశంలో కొవిడ్-19 తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా చైనా రాయబారి జీ రింగ్ దిల్లీలో ఈ మేరకు ప్రకటన చేశారు.
కరోనాతో ఇబ్బందులు పడుతున్న భారత్‌కు సాయం చేసేందుకు చైనా సంస్థలు నిధులు పోగుచేస్తున్నట్లు జీరింగ్ వెల్లడించారు. అంతేకాకుండా భారత్‌కు అవసరమైన సాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. విపత్కర సమయంలో చైనాకు వైద్య పరికరాలు అందించడంతో పాటు కరోనా పోరులో భారతీయులు ఇచ్చిన మద్దతును గుర్తుచేశారు. కొవిడ్-19 కారణంగా చైనాలో 3,200మంది మరణించగా 82వేల మంది దీనిబారిన పడ్డారు. ఆ సమయంలో భారత్ మాస్కులు, గ్లౌజులతోపాటు 15టన్నుల అత్యవసర వైద్య పరికరాలను అందించిందని జీరింగ్ గుర్తుచేశారు. అయితే భారత్‌లో విజృంభిస్తోన్న కరోనావైరస్ను ఎదుర్కోవడంలో దేశం తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వెలిబుచ్చారు. దీనికోసం ఇప్పటికే తమ దగ్గరున్న సమాచారాన్ని భారత్‌తో పాటు దక్షిణాసియా దేశాలతో పంచుకున్నామని చెప్పారు. కరోనా పోరులో చైనా అవలంభించిన విధానాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను భారత్‌తో పంచుకున్నట్లు వెల్లడించారు.
కరోనాను చైనా సృష్టించలేదు..
ప్రపంచవ్యాపంగా కరోనా వైరస్ విజృంభిస్తోన్న సమయంలో ఈ వైరస్‌పై వస్తున్న ఆరోపణలను చైనా రాయబారి జీ రింగ్ కొట్టిపడేశారు. కరోనా వైరస్‌ను చైనా తయారు చేయడంగానీ, ఉద్దేశపూర్వకంగా వ్యాపించేలా చేయలేదని మరోసారి స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ను కొందరు ‘చైనీస్ వైరస్’, ‘వుహాన్ వైరస్’గా సంభోదించడాన్ని పూర్తిగా తప్పుబట్టారు. చైనాను దోషిగా చిత్రీకరించేపనిలో భాగంగా ఉద్దేశపూర్వకంగానే కొందరు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి ఆరోపణలు చేయడంకాకుండా ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో చైనా స్పందించిన తీరుపై అంతర్జాతీయ సమాజం దృష్టిపెట్టాలన్నారు. వుహాన్ నగరంలో కరోనావైరస్ బయటపడినప్పటికీ దీని మూలాలు చైనాలోనే ఉన్నట్లు ఇప్పటివరకు నిర్ధారణ కాలేదన్నారు. సాధారణ ప్రక్రియలో భాగంగానే ఇది పుట్టిందనే అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇదే విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ప్రకటనలను గుర్తుచేశారు.