ఒక్క‌రోజే 10 మందికి క‌రోనా…ఏప్రిల్ 15 వ‌ర‌కు తెలంగాణలో లాక్ డౌన్ః కె సి ఆర్..


హైద‌రాబాద్ – తెలంగాణాలో ఒక్క రోజులో 10 క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డ‌టం ప‌ట్ల ముఖ్య‌మంత్రి కె సి ఆర్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.. లాక్ డౌన్ కొన‌సాగుతున్నా ఇలా కేసులు పెర‌గ‌డం కరోనా తీవ్ర‌త సూచిస్తున్న‌ద‌ని అన్నారు.. కరోనా విజృంభణపై ప్రగతి భవన్ లో జ‌రిగిన‌ మీడియా సమావేశం మాట్లాడుతూ, క‌రోనా ప‌రిస్థితిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ అంత‌టా ఏప్రిల్ 15వ తేది వ‌ర‌కూ లాక్ డౌన్ కొన‌సాగిస్తామ‌ని చెప్పారు. రాష్ట్రంలో 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఒక వ్యక్తికి నయమైందని తెలిపారు. ప్రస్తుతానికి 58 కరోనా బాధితులున్నారు . మరో 20 వేల మంది ప్రభుత్వ పర్యవేక్షణలో కానీ, గృహనిర్బంధంలో కానీ ఉన్నారని, వీళ్లపై అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. కరోనా నిరోధక చర్యల్లో ప్రజల సహకారాన్ని సీఎం ప్రశంసించారు. ప్రజలు సహకరించకుంటే కరోనా విస్ఫోటనం చెందేదని, జరిగే నష్టాన్ని ఊహించలేమని అభిప్రాయపడ్డారు. అయితే, తాము లాక్ డౌన్ విధించినా, రాత్రివేళల్లో కర్ఫ్యూ పొడిగించినా ఇవాళ ఒక్కరోజే 10 కేసులు రావడం ఆందోళనకరమని, ప్రజలు పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు మరింత క్రమశిక్షణ పాటించాలని కోరారు. ఇది ఎంత భయంకరమైన వ్యాధో, అర్థం చేసుకుంటే అంత సింపుల్ వ్యాధి అని వ్యాఖ్యానించారు. దీనికి ప్రపంచంలో ఎక్కడా మందు లేదని, ఉన్న మందు ఏదంటే దీని వ్యాప్తిని నిరోధించడమేనని అన్నారు. కరోనాపై సరైన నివారణ చర్యలు తీసుకోని ఫలితంగా అన్ని వసతులు ఉన్న అమెరికా వంటి అగ్రరాజ్యం కూడా ఆగమాగం అయిపోతోందని తెలిపారు. మనదేశంలో సామాజిక దూరం పాటించడమే కరోనా నివారణకు ఏకైక మార్గమని పేర్కొన్నారు. చైనా, అమెరికా, ఇటలీ, స్పెయిన్ తరహాలో కరోనా భారతదేశంలో ప్రబలితే 20 కోట్లమందికి సోకే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారని, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే దాంట్లో మనం కూడా ఉండొచ్చని హెచ్చరించారు. దీనికి ప్రధానమంత్రులు, మంత్రులు, అధికారులు ఎవరూ అతీతులు కారని, ఈ విపత్తు సమయంలో స్వీయరక్షణే శ్రీరామరక్ష అని పిలుపునిచ్చారు. అయితే, కరోనాను ఎదుర్కోవడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని చెప్పారు. ప్రధాని మోడీతో కూడా మాట్లాడానని, ఆయన కూడా అన్నివిధాలా సహకరిస్తామని చెప్పారని వెల్లడించారు. కాగా , తెలంగాణాలో పండే ప్ర‌తి పంట‌ను ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేస్తుంద‌ని, ఏ రైతు ఆందోళ‌న‌ల చెంద‌వ‌ద్ద‌ని అన్నారు.. కొనుగోలు చేసిన త‌ర్వాత సొమ్మును ప్ర‌భుత్వం రైతుల ఖాతాలో నేరుగా వేస్తామ‌ని చెప్పారు.. అలాగే ప్ర‌జ‌లు స్వీయ నియంత్ర‌ణ పాటించాల‌ని, ఇళ్ల‌లోనే ఉండాల‌ని కోరారు.. అదే స‌మ‌యంలో రోగ నిరోధ శ‌క్తి పెరిగేందుకు చికెన్, ఎగ్ ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని కోరారు..సి విట‌మిన్ ఎక్కువుగా క‌మ‌లా, బత్తాయి, పుచ్చ‌కాయ‌లు విరివిగా తినాల‌ని కోరారు.. వాటి వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి క‌రోనా ద‌రి చేర‌ద‌ని అన్నారు.

About The Author